బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముహుర్తం ఖరారు..!!
తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. హ్యాట్రిక్‌తో సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే సిద్దం చేసిన గులాబీ బాస్.. ఒక్కొక్కటి అస్త్రాలను బయటకు తీస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నుంచి మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో పలు వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ వివిధ కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. బీసీ బంధు, రైతు రుణమాఫీని పూర్తి చేయడం.. ఇలా పలు అంశాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ప్రతిపక్షాల కంటే ముందే ఉన్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. 80 నుంచి 90 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
అయితే అభ్యర్థుల జాబితాను సిద్దం చేసినప్పటికీ.. ఆ జాబితాను ప్రకటించేందుకు కేసీఆర్ శుభసమయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెబుతున్నారు. సాధారణంగా కేసీఆర్‌కు యాగాలు, ముహుర్తాలు మీద బాగా నమ్మకమనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్.. ఇటీవల మహారాష్ట్ర వెళ్లి పలు ఆలయాలను కూడా సందర్శించారు.
ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలకు ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు అడ్డుగా ఉన్నాయి. అయితే గురువారం నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ క్రమంలోనే శ్రావణంలో మంచి ముహుర్తం చూసుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు.
2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా శ్రావణమాసం (సెప్టెంబరు 07) 105 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. కొద్ది మందికి తప్ప సిటింగ్‌లందరికీ టికెట్లు ఇచ్చారు. ప్రతిపక్షాల వ్యుహాలకు సమయం ఇవ్వకుండా వేగంగా పావులు కదిపారు.
అయితే ఇప్పుడు కూడా శ్రావణమాసంలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రెడీ అయిన గులాబీ బాస్.. అందుకు ముహుర్తం కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21.. పంచమితో కూడిన శ్రావణ సోమవారం కానుంది. దీనిని పండితులు విశేషమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో.. కేసీఆర్ కూడా అదే రోజు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఇక, తొలి జాబితాలోనే 80 నుంచి 90 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.