Telangana Assembly : కేసీఆర్ కు పదవీ గండం
Kalvakuntla Chandrashekar Rao : తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు మాాజీ సీఎంలకు పదవీగండం పొంచివుందా? కేసీఆర్,వైఎస్ జగన్ లపై అలాంటి చర్యలు తీసుకుంటారా? గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ ఆలోచన ఏమిటి?

Kalvakuntla Chandrashekar Rao
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పదవీగండం వుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. దశాబ్దకాలం సీఎంగా అపరిమిత అధికారాలను చెలాయించిన ఆయన ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారో లేక అధికారం దూరమైందని బాధపడున్నారో లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారో తెలీదుగానీ కేసీఆర్ బయటకు రావడం మానేసారు. గజ్వెల్ లోని ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయారు... హైదరాబాద్ వచ్చినా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా రాజకీయాలను కాస్త దూరంపెట్టిన కేసీఆర్ చివరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవడంలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినతర్వాత అంటే కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇప్పటికే పలుమార్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశమయ్యింది. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం సభకు హాజరుకావడంలేదు. ఎమ్మెల్యేగా కూడా స్పీకర్ ఛాంబర్ లోనే ప్రమాణస్వీకారం చేసారు కేసీఆర్. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ గడప తొక్కలేదు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు పదవీగండం తెచ్చిపెడుతోందనే ప్రచారం జరుగుతోంది.
KCR and YS Jagan
జగన్ కు వర్తించే రూల్సే కేసీఆర్ కు కూడా :
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దేశ రాజధాని డిల్లీలో ఆసక్తికర కామెంట్స్ చేసారు. అసెంబ్లీకి ఎక్కువకాలం గైర్హాజరైతే ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. ఎవరైనా సభ్యులు వరుసగా 60 రోజులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైతే చట్టప్రకారం అనర్హతకు గురవుతారని రఘురామ వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై స్పందిస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రూల్స్ గురించి వివరించారు. ఏదయినా కారణంతో అసెంబ్లీకి రాకపోతే సెలవులకు దరఖాస్తు చేసుకోవాలని... అలాకాకుండా వరుసగా 60 రోజులు గైర్హాజరైతే మాత్రం అటోమేటిక్ గా ఎమ్మెల్యే పదవిని కోల్పోతారని రఘురామ తెలిపారు.
ఇలా అసెంబ్లీ రూల్స్ గురించి చెబుతూ వైఎస్ జగన్ సభకు హాజరకాకుండే ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరించారు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు వస్తాయని అన్నారు. ప్రతిపక్ష హోదా అటుంచితే ఉన్న ఎమ్మెల్యే పదవి పోకుండా జాగ్రత్తపడాలంటూ మాజీ సీఎంపై రఘురామ కృష్ణంరాజు పరోక్షంగా సెటైర్లు వేసారు.
ఇదే రూల్ తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేతకు వర్తిస్తుంది. ఆయనకూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంలేదు... కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తెలంగాణ మాజీ సీఎంకు కూడా వర్తిస్తాయి. మరి కేసీఆర్ అసెంబ్లీ అనుమతి తీసుకుని సభకు హాజరుకావడంలేదా? స్పీకర్ అనుమతి ఏమైనా తీసుకున్నారా? అన్నది తెలియాల్సి వుంది.
ఒకవేళ ఎలాంటి అనుమతి లేకుండా కేసీఆర్ సభకు గైర్హాజరైతే మాత్రం రేవంత్ సర్కార్ చేతికి అస్త్రం దొరికినట్లే. రూల్స్ ప్రకారం కేసీఆర్ పై అనర్హత వేటువేస్తే మాత్రం గజ్వెల్ లో ఉపఎన్నికలు తప్పవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
Kalvakuntla Chandrashekar Rao
కేసీఆర్ కు ఇప్పటికే లీగల్ నోటీసులు :
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పదవీగండం సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఫార్మ్ హౌస్ కు పరిమితం కావడంపై కొన్నివర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అసెంబ్లీకి హాజరుకాని ప్రతిపక్ష నాయకుడిపై వేటు వేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ డిమాండ్ చేస్తోంది... ఈ మేరకు కేసీఆర్ కు లీగల్ నోటీసులు జారీ చేసారు.
ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి ఈ నోటీసులు పంపారు. కేసీఆర్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సమన్ల జారీచేసి వివరణ కోరాలని ఈ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ సూచించారు. లేదంటే కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. అసెంబ్లీకి హాజరై ప్రజల తరపున పోరాడాలని కేసీఆర్ ను కోరారు విజయ్ పాల్.
ఇలా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై రచ్చ మొదలయ్యింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ గురించి ఆ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు అసెంబ్లీ హాజరుకావడం లేదు... మరి ఇద్దరిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.