ప్యాచప్: ఒకే వేదిక మీదికి కేసీఆర్, చినజీయర్ స్వామి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, త్రిదండి చినజీయర్ స్వామిలు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, త్రిదండి చినజీయర్ స్వామిలు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించనున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడిలో సెప్టెంబర్ 4న జరిగే కార్యక్రమంలో కేసీఆర్, చినజీయర్ స్వామిలు పాల్గొననున్నారు. అయితే వీరు ఇరువురు ఒకే వేదికపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
kcr
ఎందుకంటే.. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో సమతా విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి చివరిసారిగా 2022 జనవరిలో సమావేశమయ్యారు. సమతా విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ప్రధాని మోదీకి చినజీయర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని భావించిన కేసీఆర్ ఆయనను దూరం పెట్టారనే ప్రచారం జరిగింది.
అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చాయి. 2022 మార్చిలో పునరుద్ధరించిన యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి చిన జీయర్ స్వామిని ఆహ్వానించలేదు. దీంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగిందని అంతా భావించారు.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గత కొంతకాలంగా కేసీఆర్ వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. బీజేపీపై, మోదీపై గతంలో మాదిరిగా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం లేదు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చినజీయర్, కేసీఆర్‌ల మధ్య సయోధ్య కోసం కొన్ని రోజులుగా తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వారు ఈ ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, చినజీయర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి బుధవారం తెలిపారు. ఇక, చినజీయర్, కేసీఆర్ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో.. ఇద్దరి మధ్య ప్యాచప్ జరిగిందనే ప్రచారం తెరమీదకు వచ్చింది.