IMD Cold Wave Alert : రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాలపై చలి పంజా
Weather Update : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.

ఈ నెలలోనే రికార్డులు బద్దలుగొట్టే చలి
IMD Cold Wave Alert : వర్షాకాలం పూర్తయ్యింది... శీతాకాలం మొదలయ్యింది. ఇప్పటికే చల్లని గాలులు తెలుగు రాష్ట్రాలను తాకుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది… రాబోయేరోజుల్లో ఇది తారాస్థాయికి చేరుతుందని వాతారవరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఈ నవంబర్ లో గత ఏడేళ్లులో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని... ముఖ్యంగా తెలంగాణపై చలి పంజా విసురుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
ఉష్ణోగ్రతలు ఎందుకు పడిపోతున్నాయో తెలుసా?
ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి... కానీ ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం ఉంది. కొన్నిసార్లు భారీ వర్షాలు కురిసిన తర్వాత వాతావరణం పూర్తి డ్రైగా మారిపోతుంది... ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలుంటాయట. ఈ క్రమంలోనే రాబోయే 10-15 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందనేది తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా.
INDIA AND TELANGANA GOING TO WITNESS ONE OF THE COLDEST, BEST WINTER CHILL IN NOVEMBER IN LAST 7YEARS 🥶🥶
Reason :- Earlier Cyclone Montha towards AP, TG completely derailed the Northeast monsoon rains for TN, AP, also MJO suppression is going to cause super dry conditions next…— Telangana Weatherman (@balaji25_t) November 7, 2025
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగులలో 15.1 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. వాయువ్య భారతదేశం నుండి చలిగాలులు వీస్తున్నాయని... వీటి ప్రభావంతోనే చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఎముకలు కొరికే చలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణను వణికిస్తున్న చలి
తెలంగాణ విషయానికి వస్తే అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి... అక్కడ 17.2 డిగ్రీ సెల్సియస్ గా ఉంది. ఇక మెదక్ 18, హన్మకొండ 19.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది... అత్యల్పంగా పటాన్ చెరులో 17.4, దుండిగల్ 18.1, హయత్ నగర్ 19 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 17 నుండి 23 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఖమ్మంలో 33.6 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది.
ఏపీకి వర్షసూచన
ఆంధ్ర ప్రదేశ్ లోని కొస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీంతోపాటు తమిళనాడు, పాండిచ్చెరి, కేరళ, అండమాన్ నికోబార్, యానాంలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయట. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.