IMD Rain Alert : ఈ మూడ్రోజులు తెలుగు ప్రజలు బిఅలర్ట్... కుండపోత వానలతో వరద బీభత్సమేనా?
దేశవ్యాప్తంగా రాబోయే ఐదారు రోజులు వర్షాలు దంచికొడతాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. తెలుగు రాాష్ట్రాల్లోనూ వర్షబీభత్సం తప్పదట.. ఏయే రోజుల్లో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించిందంటే…

దేశవ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు
IMD Rain Alert to Telangana And Andhra Pradesh : ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. తెలంగాణతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. హిమాలయ పర్వతప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి ప్లాష్ ప్లడ్స్ సంభవించడంతో పలు ప్రాంతాల్లో ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలను కూడా వర్షాలు ముంచెత్తాయి... అయితే మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా వరదలు సంభవించే స్థాయి వర్షాలు మాత్రం ఇక్కడ కురవలేదు.
మళ్లీ వరద బీభత్సం తప్పదా?
ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరదలతో ఇబ్బందిపడ్డ ప్రాంతాల ప్రజలకు ఊరట లభించింది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నారు... ప్రజలు వరద బీభత్సాన్ని మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్ మెంట్ (IMD) ఆందోళనకర ప్రకటన చేసింది... ఇవాళ్టి నుండి అంటే సెప్టెంబర్ 10 నుండి దేశవ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇది దేశ ప్రజల్లో మరోసారి భయాన్ని పుట్టిస్తోంది… ఈసారి ఏం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడ్రోజులు భారీ వర్షాలే
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూడ్రోజులు (సెప్టెంబర్ 10 నుండి 13 వరకు) భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. తెలంగాణలో ఈ వర్షాలకు పిడుగులు కూడా తోడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు... కాబట్టి వర్షం కురిసే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఏపీలో భారీ వర్షాలే కాదు ఈదురుగాలులు కూడా
ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులు, బలమైన ఈదురుగాలులు ఈ వర్షాలకు తోడవనున్నాయట... మరీముఖ్యంగా రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి హెచ్చరించింది. గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి ఏపీలోని తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తెలుగు ప్రజలారా... ఈ మూడ్రోజులు జాగ్రత్త
ఈ మూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండి హెచ్చరిస్తోంది. కాబట్టి తెలుగు ప్రజలు ఈ వర్షసూచనలను దృష్టిలో ఉంచుకుని రోజువారి పనులు ప్లాన్ చేసుకోవాలి. ఇటీవల కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాదిరిగా కుండపోత వర్షాలు కురిస్తే విద్యార్థులకు స్కూల్ హాలిడేస్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఉంటుంది. అలాగే రైతులు ఈ మూడ్రోజులు వర్షాల కారణంగా నష్టం జరిగే వ్యవసాయ పనులకు దూరంగా ఉండటం మంచిది. వర్షం కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి.
రాష్ట్రాలవారిగా వర్షసూచన
1. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజెరం, త్రిపుర రాష్ట్రాల్లో సెప్టెంబర్ 10 నుండి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.
2. మధ్య ప్రదేశ్, అండమాన్ నికోబార్, చత్తీస్ ఘడ్, బిహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల్లో సెప్టెంబర్ 10 నుండి 15 వరకు అక్కడక్కడ మోస్తరు, కొన్నిచోట్లు భారీ, మరికొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
3. ఉత్తర ప్రదేశ్ లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు సెప్టెంబర్ 11, 12, 15, 16 తేదీల్లో కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్ 13, హిమాచల్ ప్రదేశ్ లో సెప్టెంబర్ 13, 14, ఉత్తరాఖండ్ లో సెప్టెంబర్ 12 నుండి 15 వరకు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండి ప్రకటించింది.
4. మహారాష్ట్రలో సెప్టెంబర్ 12-16, గోవాలో 13-16, గుజరాత్ లో 14-16 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందట. మహరాష్ట్రలో సెప్టెంబర్ 13, 14న అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండి తెలిపింది.
5. తమిళనాడు, కేరళ, కర్ణాటక, యానాం ప్రాంతాల్లో సెప్టెంబర్ 10 నుండి 13 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే ఐదురోజులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.