Weather Update: మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
AP, Telangana Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తక్కువ ఒత్తిడి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ఉధృతి పెరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రాల వ్యాప్తంగా మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణ పలు జిల్లాల్లో, అలాగే తీర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ట్రాఫిక్ అంతరాయాలు, వరద ముప్పు తలెత్తే అవకాశముందని అధికారులు సూచించారు.
తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన తక్కువ ఒత్తిడి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 13న ఈ తక్కువ ఒత్తిడి కారణంగా ఇప్పటికే తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం తీర ఆంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తార వర్షాలు కురిసే అవకాశముంది. ఇక కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నేడు (శుక్రవారం) భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.
తెలంగాణ వాతావరణం
భారత వాతావరణ శాఖ (IMD)ప్రకారం తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం, శనివారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగితా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ పరిస్థితి ఇలా...
హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 14 నుంచి 16 వరకు నగరంలో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల సమయంలో పలు ప్రాంతాలు నీటిలో మునగవచ్చనీ, ట్రాఫిక్ అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.