- Home
- Telangana
- Hyderabad Weekend Trips : వర్షాకాలంలో తప్పక చూడాల్సిన టాప్ 5 వాటర్ ఫాల్స్.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొండి
Hyderabad Weekend Trips : వర్షాకాలంలో తప్పక చూడాల్సిన టాప్ 5 వాటర్ ఫాల్స్.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొండి
Hyderabad Weekend Trips : పిల్లలకు దసరా సెలవులు.. పేరెంట్స్ కు వీకెండ్ సెలవులు. కాబట్టి ఈ రెండ్రోజుల్లోనే హైదరాబాద్ నుండి వెళ్లివచ్చేంత దూరంలో ఉన్న టాప్ 5 జలపాతాలివే..

ఈ జలపాతాలు అందంతోనే కనువిందు చేస్తాయి
Hyderabad Weekend Trips: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి అందాలు రెట్టింపవుతాయి... గలగల పారే నీటిప్రవాహాలు, భూమిపై గ్రీన్ కార్పెట్ పర్చినట్లు మొలిచే పచ్చిక, కొత్తగా చిగురించిన ఆకులతో పచ్చని చీర కట్టినట్లుగా కనిపించే చెట్లతో కూడిన అడవులతో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. నేచర్ ను ఎంజాయ్ చేయాలంటే వర్షాకాలమే సరైన సమయం... చిటపట చినుకుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ సమయంలో ఎత్తైన కొండలపైనుండి జాలువారే జలపాతాలను జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను అందిస్తాయి.
ప్రస్తుతం పిల్లలకు దసరా సెలవులు కొనసాగుతున్నాయి... ఉద్యోగులకు కూడా వీకెండ్ సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కు దగ్గర్లో సహజసిద్దంగా ఏర్పడిన వాటల్ ఫాల్స్ అందాలను చుట్టివచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు రోజుల్లోనే ఈ ట్రిప్ ను పూర్తిచేయవచ్చు. ఇలా హైదరాబాద్ సమీపంలోని అందమైన వాటర్ ఫాల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. కుంటాల జలపాతం
ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన జలపాతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో ఉంటుంది. ఎత్తయిన సహ్యాద్రి పర్వతాలపైనుండి కడెం నది జలాలు కిందకు దూకడం చూస్తుంటే కనువిందుగా ఉంటుంది. దాదాపు 45 మీటర్ల ఎత్తునుండి కిందకు జాలువారే నీరు తుంపర్లు తుంపర్లుగా శరీరాన్ని తాకుతుంటే మైమరచిపోతారు. ఆ నీటి సవ్వడి సంగీత కచేరీలా చెవులకు ఇంపుగా వినిపిస్తుంది. వర్షాకాలంలో నీటిప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జలపాతం అందాలు కూడా రెట్టింపవుతాయి.
హైదరాబాద్ నుండి కుంటాల జలపాతం 200 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుండి 60 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే భారీ వర్షాల సమయంలో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించరు. కాబట్టి ఇక్కడికి వెళ్లాలనుకుంటే ముందుగానే అనుమతిస్తున్నారో లేదో తెలుసుకోవడం మంచిది.
2. మల్లెలతీర్థం జలపాతం
ఈ జలపాతం మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ పరిధిలో ఉంటుంది. దట్టమైన నల్లమల అడవిలో సహజసిద్దంగా ఏర్పడిన జలపాతమిది. 500 అడుగులు ఎత్తునుండి నీరు కిందకు జాలువారుతుండే ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు చుట్టూ అటవీ అందాలు, కొండలు ఈ జలపాతం అందాలను రెట్టింపు చేస్తాయి. హైదరాబాద్ నుండి శ్రీశైలంకు వెళ్లే దారిలోనే ఈ జలపాతం ఉంటుంది... కాబట్టి నగరంనుండి ఒక్కరోజులో ఈ వాటర్ ఫాల్ ట్రిప్ ను పూర్తిచేయవచ్చు.
3. భీమునిపాదం జలపాతం
ఈ జలపాతం వరంగల్ పట్టణానికి సమీపంలో మహబూబాబాద్ జిల్లాలో ఉంటుంది. గూడూరు మండలం కొమ్ములవంచ అటవీప్రాంతంలో 70 అడుగుల ఎత్తునుండి జలధార కిందకు దూకుతుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ కొండపైకి నీరు ఎలా చేరతాయో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. పాండవుల వనవాసం సమయంలో భీముని కారణంగా ఈ జలపాతం ఏర్పడిందని... అందుకే దీనికి భీమునిపాదం జలపాతంగా పేరు వచ్చిందని స్థానికులు కథలుకథలుగా చెబుతుంటారు. ఇది హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
4. పొచ్చెర జలపాతం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరో అద్భుత జలపాతం ఈ పొచ్చెర. ఈ సహ్యాద్రి పర్వతశ్రేణులు గుండా ప్రవహించే గోదావరి నది పాయలుగా ప్రవహిస్తూ కిందకు దూకుతుంది. వర్షాకాలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. ఇది నిర్మల్ కు 37 కి.మీ, ఆదిలాబాద్ కు 47 కి,మీ దూరంలో ఉంటుంది.
5. గాయత్రి జలపాతం
ఇదికూడా ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంటుంది. సుమారు 70 మీటర్ల ఎత్తులోని కొండపైనుండి నీరు కిందకు దూకుతుంది. ఇది సహజసిద్దంగా ఏర్పడిన జలపాతం. ఇది తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతాల్లో ఒకటి. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్లే జాతీయ రహదారికి దగ్గర్లోనే ఈ జలపాతం ఉంటుంది.
గమనిక : వర్షాకాలంలో జలపాతాల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని చూసేందుకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి. స్థానిక పోలీసులు, అధికారుల సూచనలను పాటించాలి.