హైదరాబాద్ ఇన్పోసిస్ లో కొత్తగా 17,000 ఐటీ జాబ్స్ ... భర్తీ ఎప్పట్నుంచో తెలుసా?
తెలంగాణలో ఉద్యోగాల జాతర జరగనుంది. ఇన్సోసిస్ తో పాటు అమెజాన్ వంటి మల్టి నేషనల్ కంపనీలు హైదరాబాద్ లో బారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఎంతమంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయో తెలుసా?

Telangana Jobs
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ అదరగొట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. దీంతో తెలంగాణకు లక్షలకోట్ల పెట్టుబడులే కాదు వేలాదిగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇలా ఈ సదస్సు ద్వారా ఊహించినదానికంటే ఎక్కువగా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి...దీంతో రేవంత్ బృందం విజయానందంతో స్వరాష్ట్రానికి సగర్వంగా పయనమైంది.
ఇప్పటివరకు ఈ దావోస్ ఎకనమిక్ ఫోరం ద్వారా తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన తెలంగాణ బృందం వ్యాపారవేత్తలతో సమావేశమై హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి వివరించారు. అంతేకాదు ప్రభుత్వ సహకారం కూడా అందిస్తామని హామీ ఇవ్వడంతో దాదాపు 10 సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకువచ్చి ఒప్పందం చేసుకున్నాయి. ఇక మరికొన్ని కంపనీలు కూడా తెలంగాణకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రేవంత్ బృందం చెబుతోంది.
ఇలా దావోస్ సదస్సు ద్వారా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులే కాదు... వేల ఉద్యోగాలు కూడా రానున్నాయి. కొత్తగా చేసుకున్న ఒప్పందాల ద్వారా తెలంగాణలో ఏకంగా 46 వేల ఉద్యోగాల రానున్నాయని... పరోక్షంలో మరికొన్ని వేలమందికి ఉపాధి లభించనున్నాయి. ఈ సమాచారం డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఊరటనిస్తోంది.
it jobs in hyderabad
ఇన్ఫోసిస్ లో కొత్తగా 17,000 ఐటీ ఉద్యోగాలు :
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్దమయ్యింది. ఇందులొ భాగంగా పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో కొత్తగా 17 వేల మంది ఉద్యోగులను భర్తీ చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఇన్పోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ విషయాన్ని దావోస్ సదస్సులో ఇన్పోసిస్ సీఎఫ్వో జయేష్ సంఘరాజ్కా వెల్లడించారు.
దావోస్ సదస్సులో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన ఆయన ఇన్ఫోసిస్ భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. హైదరాబాద్ లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపిన ఇన్ఫోసిస్ సిఎఫ్వో జయేష్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుందని ఆయన తెలిపారు. వచ్చే రెండు మూడేళ్లలో ఈ నిర్మాణాలను పూర్తిచేసి కార్యకలాపాలను ప్రారంభిస్తామని జయేష్ స్పష్టం చేసారు.
ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుందని ఇన్పోసిస్ సిఎఫ్వో అభిప్రాయపడ్డారు. తద్వారా దేశంలోనే ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ మారుతుందని... ఈ నగర ప్రతిష్టను మరింత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో దాదాపు 35000 మంది ఉద్యోగులున్నారని... భవిష్యత్ లో చేపట్టే ఉద్యోగాలతో ఈ సంఖ్య 50 వేలు దాటుతుందని సిఎఫ్వో జయేష్ సంఘరాజ్కా పేర్కొన్నారు.
it jobs in hyderabad
హైదరాబాద్ లో అమెజాన్ పెట్టుబడులు :
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పటికే అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పెట్టుబడులు పెట్టింది. అయితే తాజాగా దావోస్ వేదికగా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ లో మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు అమెజాన్ ముందుకు వచ్చింది... ఈ మేరకు తెలంగాణ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
దాదాపు రూ. 60000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. భారీ పెట్టుబడులతో ఇప్పటికే రాష్ట్రంలో మూడు డాటా సెంటర్లను అభివృద్ధి చేసింది అమెజాన్. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.
అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.