Hyderbad : ఇంటి అద్దె లేదు, ఫుడ్ ఖర్చు లేదు... ఇలా చేస్తే హైదరాబాద్ లో అన్నీ ఫ్రీ
హైదరాబాద్ నగరానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకోసం వచ్చే పేదలకు జిహెచ్ఎంసి సాయం అందిస్తోంది. నగరంలో ఉచితంగానే వసతి కల్పించడమే కాదు మంచి అహారం అందిస్తోంది.. ఈ సాయం కోసం ఏం చేయాలంటే…

హైదరాబాద్ లో ఫ్రీ షెల్టర్, ఫ్రీ ఫుడ్
Hyderabad : మారుమూల పల్లెల్లోనే జీవన వ్యయం పెరిగింది... గతంలో మాదిరిగా ఏదీ ఉచితంగా రావడంలేదు... ప్రతిదీ డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. అలాంటిది హైదరాబాద్ వంటి మహానగరంలో ఓ మనిషి జీవించాలంటే ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో కేవలం సింగిల్ రూం అద్దె ఐదారువేలకు తక్కువలేదు... అహారం కోసం కూడా అదేస్థాయిలో ఖర్చవుతుంది. ఇక బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో అయితే వేలకు వేలు ఖర్చవుతుంది.
అయితే ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి చాలామంది హైదరాబాద్ కు వస్తుంటారు. వీరిలో ఎక్కడా పనిదొరక్క ఆర్థిక కష్టాలతోనే పుట్టిపెరిగిన ఊరిని, కుటుంబాన్ని వదిలిపెట్టివచ్చేవారే ఎక్కువమంది ఉంటారు. ఇలా ఖాళీచేతులతో వచ్చేవారు ఉండడానికి గూడు, తినడానికి కూడు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారి కోసమే మానవత్వంలో ఆలోచించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) సరికొత్త ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లో హోమ్ లెస్ షెల్టర్లు
Hyderabad Homeless Shelter : పల్లెటూళ్ళలో ఎలాగైనా బ్రతకొచ్చు... ఇళ్లు లేకపోతే ఏ గుడిదగ్గరో, ఎవరింటి పంచనో… తిండి లేకపోతే అడవుల్లో ఏ కాయో, పండో తిని బ్రతకొచ్చు. కానీ పట్టణాలు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో అలాకాదు. ఏది కావాలన్నా దొరుకుతుంది… కానీ అన్నింటికీ డబ్బులు చెల్లించాల్సిందే. చివరకు డిల్లీ వంటి నగరాల్లో స్వచ్చమైన గాలిని కూడా కొనే పరిస్థితి ఉంది… హైదరాబాద్ లో ఇంకా ఇలాంటి పరిస్థితి రాలేదుగానీ వసతి, అహారం కోసం భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే.
నగరానికి బ్రతుకుదెరువు కోసం వచ్చి చేతిలో చిల్లిగవ్వ లేనివారిలో కొందరు దిక్కుతోచని పరిస్థితుల్లో బిచ్చగాళ్లుగా మారుతున్నారు. బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో ఇలా డబ్బులు అడుక్కునేవాళ్లను… ప్లైఓవర్ల, ఫుట్ పాత్ లపై నివాసముండేవారిని మనం నిత్యం చూస్తుంటాం. వీరంతా నగరంలో మంచి జీవితం లభిస్తుందని వచ్చి చివరకు దిక్కుతోచని పరిస్థితిలో అగౌరవంగా బ్రతుకుతున్నవారే. ఇది గమనించిన జిహెచ్ఎంసి ఏదయినా పని చేసుకోవాలని భావించేవారికి కొంతకాలం ఫ్రీగా వసతి, అహారం అందించి గౌరవప్రదంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది.
హైదరాబాద్ లో ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నవారు జిహెచ్ఎంసి కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి నిర్వహిస్తున్న హోంలెస్ షెల్టర్లలో ఆశ్రయం పొందవచ్చు. ఏదయినా పని దొరికి డబ్బులు సంపాదించడం ప్రారంభించి బయటికి వెళ్లి బ్రతకగలమని నమ్మకం వచ్చేవరకు అక్కడ ఉండొచ్చు. ఇలా ఒకటిరెండు కాదు ఆరు నెలల వరకు హోంలెస్ షెల్టర్లలో ప్రీగా ఉండవచ్చు.
హైదరాబాద్ లో హోంలెస్ షెల్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?
హైదరాబాద్ లోని ప్రధాని ప్రభుత్వ హాస్పిటల్స్ గాంధీ, ఉస్మానియా వంటివాటిలో ఈ షెల్టర్లు ఉన్నాయి. అలాగే నగరంలో ప్రధాన ఆర్టిసి బస్టాండ్ జేబిఎస్ సమీపంలోని అప్జల్ గంజ్ లో ఓ షెల్టర్ ఉంది. యూసుఫ్ గూడా, లింగంపల్లి, శేరిలింగంపల్లి, టప్పాచబుత్రాలో కూడా హోంలెస్ షెల్టర్లు ఉన్నాయి. అయితే ఇవి కేవలం పురుషుల కోసం ఏర్పాటుచేసినవే.
ఇక మహిళల కోసం కూడా నగరంలో ప్రత్యేక హోంలెస్ షెల్టర్లున్నాయి. ఉప్పల్, గోల్నాక, దిల్ సుఖ్ నగర్ లలో కేవలం మహిళల కోసమే హోంలెస్ షెల్టర్లు నిర్వహిస్తోంది జిహెచ్ఎంసి. నిరాశ్రయులై రోడ్డునపడ్డవారు, దిక్కులేని ఒంటరి మహిళలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు.
హోంలెస్ షెల్టర్లలో ఉచిత వైద్యం
హైదరాబాద్ నగరంలో 18వరకు హోంలెస్ షెల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1000 మందివరకు ఆశ్రయం పొందుతుంటారు. ఉచితంగానే వసతి, అహారంతో పాటు అనారోగ్య, మానసిక సమస్యలుంటే వైద్యసాయం కూడా అందిస్తారు. ప్రముఖ వైద్యులు ఈ హోంలెస్ సెంటర్లలోని వారికి స్వచ్చందంగా వైద్యం అందించడానికి ముందుకు వస్తుంంటారు. అలాగే జిహెచ్ఎంసి వారికి మందులను కూడా ఉచితంగానే అందిస్తుంది.
హోంలెస్ షెల్టర్ లో చేరడం ఎలా?
ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ కు చేరుకునేవారు కూడా సంపాదన మొదలయ్యేవరకు ఈ హోంలెస్ షెల్టర్లలో ఆశ్రయం పొందవచ్చు. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఇక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తారు.
అయితే ఈ హోంలెస్ షెల్టర్లలో కేవలం ఆరునెలల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలోపు ఎలాంటి ఉద్యోగం, ఉపాధి దొరకలేదంటే మరో రెండునెలలు ప్రత్యేకంగా అనుమతి ఇస్తారు.
కొన్నిసార్లు ఈ హోంలెస్ షెల్టర్లలో ఉండేవారికి నిర్వహకులే ఉపాధి అవకాశాలు చూపిస్తారు. ఇలా అందరూ గౌరవప్రదంగా జీవించాలి... ఎవరూ ఆర్థిక కష్టాలతో రోడ్డునపడి జీవితాన్ని దుర్భరంగా మార్చుకోవద్దనే సదుద్దేశంతో ఏర్పాటుచేసిన హోంలెస్ షెల్టర్లు ఇప్పటికే ఎంతోమంది జీవితాలను బాగుచేసాయి... ఇంకెంతో మందికి అమ్మలా మారి ఒడిన చేర్చుకుంటున్నాయి... నాన్నలా మారి కడుపు నింపుతున్నాయి.