- Home
- Telangana
- పెళ్లికి ముందునుంచే భార్య వివాహేతర సంబంధం.. వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో.. ఆ భర్త చేసిన పని..
పెళ్లికి ముందునుంచే భార్య వివాహేతర సంబంధం.. వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో.. ఆ భర్త చేసిన పని..
భార్య వివాహేతరం సంబంధంతో మనస్తాపం చెందిన భర్త గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

కరీంనగర్ : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను నిలువునా కూల్చేస్తున్నా అలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని మానసిక ఆందోళనలతో ఓ భర్త పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్ కుమార్ (30)కు, పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో పదేళ్ల క్రితం వివాహం అయ్యింది.
వీరికి ఇద్దరు సంతానం. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కాగా, సౌజన్యకు వివాహానికి ముందు నుంచి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉంది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ కారణంతోనే వీరి పెళ్లయిన తరువాత అనేక సార్లు పంచాయతీలు కూడా జరిగాయి. పంచాయతీ పెట్టిన ప్రతీసారి తాను ఆ సంబంధాన్ని కొనసాగించనని బాగుంటానని చెప్పేది.
ఆ తర్వాత మళ్లీ షరా మామూలుగానే పరిస్థితి కొనసాగించేది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి పనులు ఏంటంటూ భర్త ఎన్నిసార్లు మందలించినా భార్య వినలేదు. దీంతో ఇక పరిస్థితి మారేది లేదని తీవ్ర మనస్థాపానికి గురైన భర్త మానసిక ఆందోళన చెందాడు.
దీంతో ఈనెల ఆరవ తేదీన అనిల్ కుమార్ ఇంట్లో ఉన్నగడ్డి మందు తాగాడు. వెంటనే కింద పడిపోయాడు. ఇది గమనించిన అనిల్ కుమార్ తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు అతడిని వెంటనే చికిత్స కోసం ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు అనిల్ కు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన మరుసటిరోజే అనిల్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. దీంతో ఈనెల తొమ్మిదవ తేదీన కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడిని చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే మనస్తాపంతో తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని తన పెద్ద బావ శ్రీనివాస్ కు సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేశాడు.
ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి రెండు గంటలకు తుది శ్వాస విడిచాడు. కొడుకు మృతితో తల్లి పుష్పలత కన్నీరు మున్నూరుగా రోధిస్తూ… పోలీసులకు తన కోడలి మీద ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వివరాలను సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.