- Home
- Telangana
- Godavari Flood : తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితి... భారీ వర్షాలే లేకున్నా ఈ ప్రాంతాల్లో వరదలు... ఎలా సాధ్యమబ్బా!
Godavari Flood : తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితి... భారీ వర్షాలే లేకున్నా ఈ ప్రాంతాల్లో వరదలు... ఎలా సాధ్యమబ్బా!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేకపోయినా గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల్లేవు... కానీ వరదలు
Godavari Flood : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలే లేవు. జూన్ నెలంతా లోటు వర్షపాతమే... జులైలో కూడా ఇప్పటివరకు భారీ వర్షాలు కురిసిందే లేదు. అయినా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నదులపై ఉన్న జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో వర్షాలే లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి.
ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి నదులు
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నదులకు భారీ వరద నీరు చేరుతోంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు వరదనీటితో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నారు... దీంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగింది... ఇది మరింత పెరిగి కాళేశ్వరం ప్రాజెక్టులకు 5 నుండి 6 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలవరంకు పోటెత్తిన వరదనీరు
పోలవరం ప్రాజెక్టుకు కూడా భారీగా వరదనీరు చేరుతోంది.. ఇప్పటికే లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ఈ వరదనీటి ప్రవాహం మరింత పెరిగి నాలుగైదు రోజులకు 9 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, పోలవరం ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నేడు తెలంగాణలో వర్షాలుంటాయా?
తెలంగాణలో రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని గత రెండుమూడు రోజులుగా వాతావరణ శాఖ చెబుతూ వస్తోంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసింది లేదు. దీంతో ఇప్పటికీ తెలంగాణలో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు తప్పడంలేదు.
మరో రెండుమూడు రోజులు అంటే జులై 13 వరకు తెలంగాణలో చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు (జులై 10, గురువారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది... నిజామాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మంచి వర్షపాతమే నమోదయ్యే అవకశాలున్నాయని తెలిపింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది. హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ లో మధ్యాహ్నం లేదా సాయంత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇలా వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వర్షాలుంటాయా?
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రోజంతా దట్టమైన మేఘాలు కమ్మేసి ఉంటాయి... కానీ వర్షాలు మాత్రం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. చల్లచల్లగా వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుదని.. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రెండుమూడు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని... జులై సెకండాఫ్ లో భారీ వర్షాలు ఆశించవచ్చని చెబుతోంది.
నేడు (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయట. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.