భూమి వున్న ప్రతిఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
భూమి... ప్రతి ఒక్కరు కోరుకునే ఆస్తి. భూమిని కలిగివుండటమే కాదు దాన్ని కాపాడుకోవడం కూడా ఈ కాలంలో చాలా ముఖ్యం. కాబట్టి మీ వద్ద భూమి వుంటే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

Land measurement
ప్రతి ఒక్కరు తమకు ఎంతోకొంత భూమి వుండాలని కోరుకుంటారు. వ్యవసాయం చేసే రైతులే కాదు చిరు ఉద్యోగులు, కార్పోరేట్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు...ఇలా ప్రతి ఒక్కరు భూమి కోసం తాపత్రయపడుతుంటారు. ఇలా కొందరు ఎకరాల్లో భూమిని, మరికొందరు వందల ఎకరాలు భూములు కొంటుంటారు.
భూమి కొనడం ఈజీనే... కానీ దాని కొలతలను అర్థం చేసుకోవడమే రాకెట్ సైన్స్ లాంటిది. వందల ఎకరాలు కలిగినవారికి కూడా సాధారణంగా భూమి కొలతలు అర్థంకావు. అందుకే భూములను కొలిచేందుకు ప్రత్యేకంగా సర్వేయర్లు వుంటారు. ప్రత్యేక పద్దతుల్లో భూముల కొలతలు చేపట్టి మనకు వివరాలు ఇస్తుంటారు సర్వే సిబ్బంది.
అయితే సర్వే రిపోర్ట్ లో కూడా వాడే పదాలు కూడా మనల్ని కన్ఫ్యూజన్ చేస్తుంటాయి. కాబట్టి ప్రతిఒక్కరు భూమి కొలతలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు భూములు ఎన్నిరకాలు? ఏ రకాన్ని ఏమంటారు? ఎకరాకు ఎన్ని గుంటలు? ఎన్ని సెంట్లు? ఎన్ని చదరపు అడుగులు? తదితర వివరాలు తెలుసుకుందాం.
Land measurement
భూముల రకాలు :
భూమి సారం, నీటి సదుపాయం, పంటలు, సంక్రమించిన విధానం, యజమానులు తదితర వివరాల ఆదారంగా భూమి పేర్లు వుంటాయి. ప్రాంతాన్ని బట్టి ఈ పేర్లు మారిపోతుంటాయి. భూసారం ఆదారంగా తరి, ఖుష్కీ, బంజరు ఇలా అనేక రకాలు వుంటాయి. అలాగే భూమి సంక్రమించిన విధానం ఆదారంగా ఇనాం, అసైన్డ్, పట్టా ఇలా అనేక రకాల పేర్లు వుంటాయి.
పట్టా భూములు :
ఈ భూమిపై యజమానికి సర్వ అధికారాలు వుంటాయి. అంటే ప్రైవేట్ వ్యక్తుల వద్దు వుండే భూమి పక్కా పత్రాలను కలిగివుంటే దాన్ని పట్టా భూమి అంటారు. ప్రభుత్వమే ఈ భూముల యజమానులకు పట్టా పాస్ పుస్తకాలను అందిస్తుంది.
అసైన్డ్ భూములు :
పట్టాభూములు అంటే సొంతంగా భూములు లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వమే భూమిని అందిస్తుంది. అలా పొందిన భూములను అసైన్డ్ భూములు అంటారు. వీటిని పొందిన రైతులు కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి... వీటిని అమ్మడానికి హక్కు వుండదు. ప్రజా అవసరాల కోసం ఈ భూములను తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి వుంటుంది.
బంజరు భూమి :
ఇది ప్రభుత్వ భూమి. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములివి. భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం ఈ భూములను కేటాయిస్తుంది.
బీడు భూములు :
ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల్లో ఎలాంటి పంట లేకుంటే దాన్ని బీడుభూమి అంటారు. ఈ భూములు పశువుల మేతకు ఉపయోగపడతాయి. రాళ్లు, గుట్టలతో కూడిన భూములు పంటలకు అనుకూలంగా వుండవు.. అందుకే వాటిని అలా వదిలేస్తారు.
ఆయకట్టు :
బోర్లు, బావులపై ఆదారపడకుండా చెరువులు, నదుల నీటితో పంటలు సాగుచేసే భూములను ఆయకట్టు భూములు అంటారు. ఈ భూములకు నీరు పుష్కలంగా వుంటుంది కాబట్టి పంటలు బాగా పండతాయి.
గ్రామకంఠం :
గ్రామాల్లో నివాసానికి కేటాయించిన భూమి. ఇది ఉమ్మడి స్థలం. గ్రామ కంఠం భూముల వివరాలు ఆయా పంచాయితీ రికార్డుల్లో వుంటాయి.
అగ్రహారం, ఇనాం భూములు :
పూర్వం పాలకుల నుండి బ్రాహ్మణులు పొందిన భూములు అగ్రహారం అంటారు. అలాగే ఇతర పనులవాళ్లకు ఇచ్చిన భూములను ఇనాం భూములు అంటారు. గతంలో రాజులు, జమిందార్లు ఈ భూములను కేటాయించారు... అప్పటినుండి ఇవి అలాగే కొనసాగుతున్నాయి.
Land measurement
భూమి పత్రాలు :
భూములకు సంబంధించిన ప్రధాన పత్రం పట్టాదార్ పాస్ పుస్తకం. మన భూమి విస్తిర్ణాన్ని ఇది సూచిస్తుంది. అలాగే భూమికి సంబంధించిన పూర్తి వివరాలను అందించేది పహాణి లేదా అడంగళ్. ఇప్పటివరకు ఈ భూమి క్రయవిక్రయాలకు సంబంధించిన చరిత్ర మొత్తం ఈ పహాణిలో వుంటుంది.
ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసి) అంటే భూమి స్వరూపాన్ని తెలియజేసే పత్రం. టైటిల్ డీడ్ అనేది భూ హక్కులకు సంబంధించి ఆర్డివో సంతకంతో కూడిన దస్తావేజు. ఇంకా భూములకు సంబంధించిన అనేక పత్రాలు వుంటాయి. వీటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే భూ క్రయవిక్రయాలు చేపడుతుంటారు.
భూమి కొలతలు :
భూమి విస్తీర్ణాన్ని సాధారణంగా ఎకరాల్లో కొలుస్తారు. 4840 చదరపు గజాలు లేదా 100 సెంట్లు లేదా 40 గుంటలకు ఒక ఎకరం. ఆంధ్రాలో సెంట్లను ఉపయోగిస్తే తెలంగాణలో గుంటల్లో కొలుస్తారు.
1 ఎకరా = 40 గుంటలు
1 ఎకరా = 100 సెంట్లు
1 ఎకరా = 4840 syd
1 ఎకరా = 43,560 sft
1 గుంట = 121 syd
1 సెంట్ = 48.4 syd
1 హెక్టార్ = 2.47 ఎకరాలు
1 హెక్టార్ = 10,000 చదరపు మీటర్లు