ఈటల రాజేందర్ పై కేసీఆర్ వెనక్కి: మంత్రివర్గ విస్తరణపై సందేహాలు
మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఈటల రాజేందర్ పై వేటు వేసి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ తొలుత భావించారని చెబుతారు. అయితే, అనూహ్యంగా ఈటల రాజేందర్ తిరుగుబాటు బావుటా ఎగురేయడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ ను తొలగిస్తే తేనెతుట్టెను కదిలించడమే అవుతుందని కొంత మంది టీఆర్ఎస్ నేతలు, మంత్రులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చెప్పినట్లు సమాచారం. దాంతో కేసీఆర్ ఈటల రాజేందర్ వ్యవహారంపై వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.
ఈటల రాజేందర్ వ్యవహారం మరింత గందరగోళానికి దారి తీయకుండా కూడా చర్యలు చేపట్టినట్లు అర్థమవుతోంది. రాజేందర్ కు అనుకూలంగా లక్ష్మీకాంత రావు ప్రకటన చేయడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని ఆయన అన్నారు. లక్ష్మీకాంత రావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. ఆ కారణంగా ఆయన ప్రకటన వెనక కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రయత్నాలు జరిగాయని, ఓ నాయకుడు తీవ్రంగా ఆ ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ అన్నారు. ఆ నాయకుడు లక్ష్మీకాంత రావేనని భావిస్తున్నారు. ఈ స్థితిలో లక్ష్మీకాంత రావు ఈటల రాజేందర్ కు అనుకూలంగా ప్రకటన చేస్తే వివాదం చాలా వరకు కొలిక్కి వస్తుందని భావించారని, అందువల్లనే ఆయన ఆ ప్రకటన చేశారని అంటున్నారు.
విస్తరణలో మంత్రివర్గంలోకి తీసుకుని కేటీ రామారావుకు డిప్యూటీ సిఎం హోదా ఇవ్వాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు సాధించడానికి వీలవుతుందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీపై కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లుగానే డిప్యూటీ సిఎంగా నియమించి ఆయన ప్రభుత్వ బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ అనుకున్నట్లు తెలుస్తోంది.
KTR