రూ.500 లకే రూ.16 లక్షల ఇంటి స్థలం.. లక్కీ డ్రా ఐడియా అదిరింది బాసూ !
Property Sale : చౌటుప్పల్‌లో ఓ వ్యక్తి తన 66 గజాల ఇంటి స్థలాన్ని రూ.500 లక్కీ డ్రా కూపన్ ద్వారా విక్రయించేందుకు నిర్ణయించాడు. నవంబర్ 2న డ్రా తీయనున్నారు. ఈ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అదిరిపోయే ఆలోచన.. లక్కీ డ్రా తో ఇంటి స్థలం విక్రయం
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ వినూత్న ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాంబ్రహ్మం అనే వ్యక్తి తన 66 గజాల స్థలాన్ని, దానిపై ఉన్న రేకుల గదిని సాధారణ విక్రయం కాకుండా లక్కీ డ్రా పద్ధతిలో అమ్మాలని నిర్ణయించుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం దాని ధర సుమారు రూ.16 లక్షలు. కానీ, ఒక్కో కూపన్ ధర రూ.500గా నిర్ణయించి 3,000 కూపన్లు ముద్రించారు. ఈ కూపన్లలో కొనుగోలు చేసిన వారిలో ఒకరికి నవంబర్ 2న లక్కీ డ్రా ద్వారా స్థలం లభించనుంది.
ఈ వినూత్న ఆలోచన వెనుక కారణమేంటి?
రాంబ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు ఏడాదిన్నరగా ఈ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ, సరైన ధర రాలేదని చెప్పారు. మరోవైపు, తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి నవంబర్ నాటికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు. సాధారణంగా బ్రోకర్లు, పేపర్ యాడ్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకం జరుగుతుంటే, ఈసారి లక్కీ డ్రా పద్ధతి అందరినీ ఆశ్చర్యపరిచింది.
500 రూపాయలకే రూ.16 లక్షల ప్రాపర్టీ.. ప్రజల్లో ఉత్సాహం
కేవలం రూ.500 పెట్టుబడితో రూ.16 లక్షల ఆస్తిని గెలుచుకునే అవకాశం ఉండటంతో, స్థానికులు ఉత్సాహంగా కూపన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ భాగం కూపన్లు అమ్ముడైనట్లు సమాచారం. “ఐడియా అదిరింది.. నువ్వు సూపర్ బాసూ” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విధానం చట్టబద్ధతపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రజలు రాంబ్రహ్మం అవసరాన్ని అర్థం చేసుకుని పాల్గొంటున్నారు.
నవంబర్ 2న లక్కీ డ్రా
లక్కీ డ్రాను నవంబర్ 2 తీయనున్నారు. ఇప్పుడు ఇది చౌటుప్పల్ ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 2న అదృష్టవంతుడిగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి మరింత పెరిగింది. కేవలం రూ.500తో 16 లక్షల విలువైన ఇంటి స్థలం ఎవరికీ దక్కుతుంది? అన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. అలాగే, చౌటుప్పల్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త చర్చకు దారితీస్తోంది.