తిలక్ వర్మ: పాకిస్తాన్‌ను పచ్చడి చేసిన ఎలక్ట్రిషియన్ కొడుకు
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను పచ్చడి చేశాడు. అదిరిపోయే అజేయ ఇన్నింగ్స్‌తో భారత కు అద్భుతమైన విజయాన్ని అందించి హీరోగా నిలిచాడు. అతనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. అతని క్రికెట్ కెరీర్ ప్రయాణం, కుటుంబ నేపథ్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆసియా కప్‌లో పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన తిలక్ వర్మ
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. కట్టుదిట్టమైన బౌలింగ్ ను ఎదుర్కొంటూ అద్భుతమైన హాఫ్ సెంచరీ నాక్ తో పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు. పాక్ బౌలింగ్ ను దంచికొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు.
సంజూ శాంసన్, శివం దుబేలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు ఏర్పరిచాడు తిలక్ వర్మ. చివరి వరకు క్రీజులో నిలిచి 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. అతని సూపర్ నాక్ తో భారత్ 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. అభిమానులు, విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు తిలక్ వర్మను ‘మ్యాచ్ విన్నర్’గా పేర్కొంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాధారణ కుటుంబం నుంచి క్రికెట్ లో ఉన్నత శిఖరాలకు చేరిన తిలక్ వర్మ
హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన తిలక్ వర్మ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి క్రికెట్ స్టార్ గా ఎదిగాడు. ఆయన తండ్రి నాగరాజు ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తారు. తల్లి గాయత్రి దేవి గృహిణి. అన్న తరుణ్ వర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆర్థిక ఇబ్బందుల మధ్య తండ్రి అదనపు పనులు చేస్తూ తిలక్ వర్మ క్రికెట్ కలను సాకారం చేశారు. 11 ఏళ్ల వయసులోనే తిలక్ క్రికెట్ వైపు అడుగుపెట్టాడు. చిన్నప్పటి నుంచే కోచ్ సలాం బయాష్ శిక్షణలో తిలక్ క్రికెట్ లో నైపుణ్యాలు సాధించాడు.
ఫస్ట్ క్లాస్ నుండి ఐపీఎల్ వరకు తిలక్ వర్మ క్రికెట్ జర్నీ
2019లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అడుగు పెట్టి, తొలి సీజన్‌లోనే 397 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2023లోనూ అదే జోరు కొనసాగించాడు. అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగుల వరదపారించాడు. ఎడమ చేతివాటం బ్యాటింగ్, కుడి చేతి బౌలింగ్ చేస్తూ సురేశ్ రైనా తరహాలో ఆడటంతో తిలక్ వర్మ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
జాతీయ జట్టులో తిలక్ వర్మ మెరుపు ప్రదర్శనలు
దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శనలతో తిలక్ వర్మ భారత జాతీయ జట్టులో చోటు సంపాదించారు. 2023లో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి వచ్చిన తిలక్, తొలి మ్యాచ్‌లోనే 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. 2019లో భారత్ తరఫున అండర్-19 వరల్డ్‌కప్‌లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో దూకుడు చూపించి, టీ20 ఫార్మాట్‌లో తన ప్రతిభను నిరూపించాడు.
ఆసియా కప్ విజయం..తిలక్ కెరీర్ లో అద్భుతమైన మలుపు
దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో ఒత్తిడిని తట్టుకొని తిలక్ వర్మ ఆడిన 69 పరుగుల ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకొచ్చింది. విరాట్ కోహ్లీ తనను ప్రశంసించడం, విశ్లేషకులు భవిష్యత్ స్టార్‌గా అభివర్ణించడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
మ్యాచ్ అనంతరం తిలక్, “భారత్ గెలవడమే లక్ష్యంగా ఆడాను. దేశాన్ని గర్వపడేలా చేయడం కోసం క్రీజులో నిలిచాను” అని అన్నాడు. తన చిన్ననాటి కోచ్ సలాంకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. హైదరాబాద్ వీధుల నుంచి ఆసియా కప్ ఫైనల్ వేదికపై హీరోగా తిలక్ వర్మ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన ప్రయాణం ఎంతో మందికి ప్రేరణాత్మకంగా నిలుస్తోంది. సాధారణ ఎలక్ట్రిషియన్ కొడుకు కృషి, పట్టుదల, ప్రతిభతో దేశం కోసం హీరోగా మారాడు.