బెంగళూరులో ‘ట్రీటూన్స్'.. కార్టూనిస్ట్ మృత్యుంజయ్ కార్టూన్ల ప్రదర్శన..
చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ్ 'ట్రీటూన్స్' (హరిత హాసం) పేరుతో గీసిన కార్టూన్‌ల ప్రదర్శన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది.
బెంగళూరు : తెలంగాణకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు మృత్యుంజయ్ కార్టూన్ల ప్రదర్శనను బెంగళూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు, విమర్శకుడు, రచయిత సురేష్ జయరామ్ ప్రారంభించారు. సావీ మిసెస్ ఇండియా ఫోటోజెనిక్ రేణుకా కుంభం గౌరవ అతిథిగా, గ్రీన్ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
సురేష్ జయరాం మాట్లాడుతూ.. మృత్యుంజయ్ గీసిన కార్టూన్లు చెట్లను నరకకూడదని, మొక్కలు నాటడం అనే అంశాలపై ఆలోచింపజేసేలా ఉన్నాయని, ఆయన గీసిన ప్రతి కార్టూన్‌ను టీ షర్టులు, హ్యాండ్ బ్యాగులపై ముద్రించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
రేణుకా కుంభం మాట్లాడుతూ, కళాకారుడు సృష్టించే ప్రదేశం ఎంత పవిత్రంగా ఉంటుందో.. చెట్లకు భావోద్వేగాలు ఉంటాయని, అవి మాట్లాడతాయని తాతయ్య కాపు రాజయ్య నుంచి చూశానని, మృత్యుంజయ్ కార్టూన్‌లు చూస్తే ఈ హరిత హాసం కనిపిస్తుందని కార్టూన్లు నిజంగా 'హరిత అద్భుతం' అని కొనియాడారు.
రాఘవేంద్ర యాదవ్ మాట్లాడుతూ మృత్యుంజయ్ గ్రీన్ ఇండియా కోసం ప్రత్యేకంగా మూడు వందల కార్టూన్లు గీశారని, వాటిలో కొన్నింటిని ఇక్కడ ప్రదర్శించడం గొప్ప విషయమని, ఈ అద్భుతమైన కార్టూన్లను భవిష్యత్ తరాలకు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.
తన తండ్రి ప్రముఖ ఇక్కత్ కళాకారుడు దివంగత చిలువేరు రామలింగం తనను కార్టూన్లు గీయడానికి ప్రేరేపించారని మృత్యుంజయ్ చెప్పారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ రూపొందించిన గ్రీన్ ఇండియా ఈ ‘ట్రీటూన్స్’ కార్టూన్‌లను గీయడానికి ప్రేరణ లభించిందన్నారు. సాధారణ పొలిటికల్ కార్టూన్‌లకు పూర్తి భిన్నంగా ఈ కార్టూన్‌లు గీస్తున్నప్పుడు కొత్త ఆనందం నింపిందని ఆయన చెప్పారు.
ఈ కార్టూన్లు చూస్తుంటే.. ఇవి గీయడానికి నేను ఇండియన్ ఇంక్ ఉపయోగించాను. ఆ పెన్సిళ్లే ఈ కార్లూన్లలో మొక్కలు మొలిపించాయి. అలా, ఇప్పుడు ఈ గ్యాలరీ 80 కార్టూన్‌లతో వికసిస్తోంది. ఈ గ్యాలరీలో ఈ కార్టూన్ మొక్కలను నాటడానికి నన్ను అనుమతించిన నరేంద్ర గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు" అన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 21 వరకు కొనసాగుతుందని గ్యాలరీ మేనేజింగ్ ట్రస్టీ వి.జి.నరేంద్ర తెలిపారు.