కేటీఆర్ మార్క్ పాలిటిక్స్... కత్తులు దూసుకున్న కడియం, రాజయ్య కలిసిపోయారుగా..!
వాళ్లిద్దరిదీ ఒకే పార్టీ అయినా ఒకరంటే ఒకరికి పడదు... నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వుంటారు... అలాంటి నాయకులను కూడా తనదైన పొలిటికల్ స్లైల్లో ఒక్కటి చేసారు కేటీఆర్.
Telangana Assembly Elections 2023
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గరపడుతున్న రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు కేసీఆర్. ఈ విషయంలో కాంగ్రెస్, బిజెపి చాలా వెనకబడ్డాయని చెప్పాలి. చివరకు బిఆర్ఎస్ టికెట్లు దక్కక అసంతృప్తితో వున్న నాయకులను సైతం ఈ రెండు జాతీయ పార్టీలు ఆకర్షించలేకపోయాయి. కొందరు నాయకులు మినహా బిఆర్ఎస్ లోనే కొనసాగేలా అసంతృప్త నేతలను బుజ్జగించడంలోనూ బిఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ విషయంలో కేటీఆర్ మార్క్ పాలిటిక్స్ పనిచేసాయని చెప్పాలి.
ktr
బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లనే బరిలోకి దింపేందుకు సిద్దమయ్యారు. కానీ వివిధ కారణాలతో కొందరు సిట్టింగ్ లను మాత్రం పక్కనపెట్టారు. అలాంటి వారిలో తాటికొండ రాజయ్య ఒకరు. గత రెండుసార్లు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ టికెట్ రాజయ్యకే దక్కగా ఈసారి మాత్రం ఆయనను నిరాశ తప్పలేదు. ఈ సీటును ఆశిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం కడియంవైపే కేసీఆర్ మొగ్గుచూపారు. దీంతొ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజయ్య పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన స్టైల్లో రాజయ్యను బుజ్జగించి పార్టీకి నష్టం జరక్కుండా అడ్డుకున్నారు.
ktr
అయితే తాజాగా ప్రగతి భవన్ లో ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇంతకాలం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న మాజీ డిప్యూటీ సీఎంలు తాజాగా ఒక్కటయిపోయారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఇక స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ లో విబేధాలు ముగిసినట్లేనని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Rajaiah
పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి వుంటానని... స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి గెలుపుకోసం పనిచేస్తానని రాజయ్య తెలిపారు. ఆయన అభ్యర్థిత్వానికి తన సంపూర్ణ మద్దతు వుంటుందని... బిఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేస్తానని అన్నారు. తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలోనే కడియం, రాజయ్య ఆలింగనం చేసుకున్నారు.
KCR KTR
మంత్రి కేటీఆర్ భవిష్యత్ లో సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విబేధాలను పక్కనపెట్టి మరోసారి స్టేషన్ ఘనపూర్ లో గులాబీ జెండా ఎగరేయాలని సూచించారు. ఇలా మంత్రి కేటీఆర్ ఇంతకాలం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులను కలిపి నాయకుడిగా మరో మెట్టు ఎక్కారు. తండ్రి కేసీఆర్ పార్టీని నిర్మిస్తే దాన్ని కాపాడుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.