బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్రలు... ఇంటెలిజెన్స్ రిపోర్ట్ : ఎంపీ వెంకటేశ్ సంచలనం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగనున్న పుట్టా మధును అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ వెంకటేశ్ నేేత ఆరోపించారు.
BRS
పెద్దపల్లి : అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పి ఛైర్ పర్సన్ పుట్టా మధును చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వెంకటేశ్ నేత సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఈ కుట్రల గురించి రిపోర్ట్ ఇచ్చి మధును అప్రమత్తం చేసిందన్నారు. కానీ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పుట్టా మధు పాదయాత్ర చేస్తున్నారని... ప్రజలే ఆయనకు అండగా వుండాలని బిఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ తెలిపారు.
BRS
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇలా పెద్దపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు కూడా నియోజకవర్గం మొత్తాన్ని పాదయాత్రతో చుట్టేయడానికి సిద్దమయ్యారు.ఇందులో భాగంగానే ముత్తారం నుండి 'ప్రజా ఆశీర్వాద యాత్ర' పేరిట పాదయాత్ర ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈసారి ఎలాగయినా గెలిచితీరాలని పట్టుదలతో వున్న పుట్టామధు ఈ పాదయాత్ర చేపట్టారు.
putta madhu
పెద్దపల్లి నియోజకవర్గంలో పదిహేను రోజులపాటు 311 కిలోమీటర్లు పుట్టా మధు పాదయాత్ర సాగనుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని చుట్టివచ్చి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పుట్టా మధు ఈ పాదయాత్ర చేపట్టారు. అయితే ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభం సందర్భంగా పుట్టా మధు భద్రతపై బిఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే ఆయనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని... అయినా ఆయన ప్రజల్లో వుండేందుకు సిద్దమయ్యారని అంటున్నారు. పుట్టా మధు కూడా తనను ఇంతకాలం మానసికంగా వేధించి ఇప్పుడు ఏకంగా అంతమొందించడానికి కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Putta Madhu
తనపై పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలపైన తప్పుడు ప్రచారం చేయిస్తూ మానసిక వేధనకు గురిచేసారని పుట్టా మధు అన్నారు. తనపై చేసిన ఏ ఒక్క ఆరోపణను ప్రతిపక్ష నాయకులు గానీ, మీడియా సంస్థలు గానీ నిరూపించలేకపోయాయని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో హైదరాబాద్ కేంద్రంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని... ప్రాణాలకు హాని తలపెట్టేందుకు కూడా సిద్దమయ్యారని అన్నారు. పలు మీడియా సంస్థలు తనపై కుట్రల్లో భాగమయ్యాయని ఆరోపించారు. తాను ఏ తప్పూ చేయలేదని... ఒకవేళ తప్పు చేస్తే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంటానని అన్నారు. ఇలా మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన పుట్టా మధు కంటతడి పెట్టుకున్నారు.
Putta Madhu
పుట్టా మధు వ్యాఖ్యలు పెద్దపల్లిలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచాయి. తమ నాయకుడికి ఏమయినా జరిగితే ఊరుకోబోమని బిఆర్ఎస్ నాయకులు అంటుంటే... ప్రజల సానుభూతి కోసమే హత్యకు కుట్రలంటూ పుట్టా మధు నాటకాలాడుతున్నారని ఇతర పార్టీల నాయకులు అంటున్నారు.