ఫ్యామిలీతో కలిసి ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్.. జీవితకాల బహుమతి అంటూ కామెంట్..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్ ఈరోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తన భార్య అపర్ణ, కుమారులతో కలిసి ఆయన ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సరదాగా బండి సంజయ్ కుటుంబంతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన సమాచారం కూడా మోదీ తెలుసుకున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్‌ను మోదీ అభినందించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు.
ప్రధాని మోదీని తన కుటుంబంతో పాటు కలిసిన బండి సంజయ్.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది గుర్తుంచుకోవాల్సిన రోజు అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి తన కుటుంబానికి ఇచ్చిన ప్రతి సెకను ఎంతో ఆనందించే సమయం.. ఇది జీవితకాల బహుమతి అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలాఉంటే.. బండి సంజయ్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఈ నెల 4వ తేదీ ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.
అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు ఘన స్శాగతం పలికేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.