గుండె స్థానంలో కాలేయం, ఊపిరితిత్తులతో పుట్టిన శిశువు... హైదరాబాద్ వైద్యులు ఏం చేసారో తెలుసా?
మన శరీరంలో ఏ భాగం ఎక్కడుండాలో అక్కడుంటేనే ఆరోగ్యంగా వున్నట్లు... అలాకాకుండా కడుపులోని భాగాలన్ని ఒకటికొకటి కలిసిపోతే. సరిగ్గా ఇదే జరిగింది ఓ శిశువు విషయంలో. మరి హైదరాబాద్ వైద్యులు ఈ కేసును ఎలా డీల్ చేసారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Hyderabad
Hyderabad : భారత దేశానికే మెడికల్ హబ్ గా మారిపోయింది మన హైదరాబాద్. ఇక్కడ ఎలాంటి అనారోగ్య సమస్యనైనా నయంచేసే బెస్ట్ డాక్టర్లు వున్నారు. అలాగే అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ ఇక్కడి హాస్పిటల్స్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇలా తాజాగా మరో అరుదైన ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసి ఓ చిన్నారి జీవితాన్ని కాపాడారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు ఎంతో శ్రమించి ఓ విదేశీ చిన్నారికి కాపాడారు.
సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ గర్భవతిగా వుండగానే కడుపులో పెరుగుతున్న శిశువుకు ప్రాణాపాయం ఏర్పడింది. కడుపులోని శిశువులో అసాధారణ పరిస్థితులను గుర్తించారు వైద్యులు. సాధారణంగా ప్రతి మనిషిలో పైన వుండే గుండె, ఊపిరిత్తులు... కిందవుండే మూత్రపిండాలు, కాలేయం, పేగులు వంటి భాగాలను వేరుచేస్తూ డయాఫ్రం వుంటుంది. అంటే ఇది ఓ అడ్డుగోడలాంటిది అన్నమాట. అందువల్లే కడుపులోకి భాగాలు గుండె,ఊపిరితిత్తుల పనికి ఎలాంటి అంతరాయం కలిగించవు.
అయితే ఈ శిశువులో ఈ డయాఫ్రం డెవలప్ కాలేదు... దీంతో కాలేయం, మూత్రపిండాలు వంటి భాగాలు గుండె స్థానంలోకి వచ్చేస్తున్నారు. దీనివల్ల గుండెతో పాటు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుంది. ఈ విషయాన్ని దంపతులకు తెలియజేసారు డాక్టర్లు... కానీ శిశువుకు వైద్యం అందించి బ్రతికించడం అసాధ్యమని చెప్పారు.
Hyderabad
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హైదరాబాద్ డాక్టర్లు :
తమ బిడ్డను కాపాడుకునేందుకు సౌదీ అరేబియా దంపతులు కలవని డాక్టర్లు లేరు... తిరగని దేశం లేదు. చివరకు ఆ దంపతులకు హైదరాబాద్ లో జరుగుతున్న అధునాతన వైద్యం గురించి తెలిసింది. దీంతో ఇక్కడి డాక్టర్లు అయితేనే తమ బిడ్డను కాపాడగలరని బలంగా నమ్మారు.అందుకే హైదరాబాద్ కు వచ్చే వైద్యసాయం కోసం ప్రయత్నించారు.
హైదరాబాద్ కు వచ్చాక ఈ దంపతులు చాలా హాస్పిటల్స్ తిరిగారు. వివిధ పరీక్షలు చేసిన శిశువు సమస్యను తెలుసుకుని బ్రతికించగలమో లేదో అనుమానాన్ని వ్యక్తం చేసారు. కానీ ఆ దంపతులు బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి వెళ్లడం భరోసా దక్కింది. అక్కడి వైద్యులు శిశువును కాపాడే బాధ్యతను తీసుకున్నారు.
హాస్పిటల్లో మహిళ కడుపులోని శిశువుకు అన్ని రకాల పరీక్షలు చేసారు. పూర్తి హెల్త్ డేటా రేడీ చేసుకున్నాక మహిళకు ప్రసవం చేసారు. ఇలా శిశువు పుట్టిన నాలుగు రోజులకే ఆపరేషన్ కు సిద్దమయ్యారు. అనుకున్నట్లుగానే అనుభవజ్ఞులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య సదుపాయాలను ఉపయోగించి విజయవంతంగా శస్త్రచికిత్స చేసారు. సంక్లిష్టమైన కేసును కేవలం కీహోల్ సర్జరీ మాత్రమే చేసి శిశువు ప్రాణాలు కాపాడారు లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు.
Hyderabad
ఈ అరుదైన ఆపరేషన్ గురించి డాక్టర్లు ఏమంటున్నారు...
సౌదీ అరేబియా శిశువుకు చేసిన అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రముఖ సీనియర్ నియోనటాలజిస్ట్ డాక్టర్ సతీష్ గంట ఈ ఆపరేషన్ గురించి మాట్లాడారు. మామూలుగా అయితే ఇలా కడుపులోని అవయవాలు గుండె భాగంలోకి వెళ్లిపోతే ఊపిరితిత్తులు ఉండాల్సిన చోట ఉండకుండా పక్కకు జరుగుతాయి... దీంతో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇలాంటి కేసుల్లో చాలావరకు శిశువులు చనిపోతారని అన్నారు.
పైగా ఇలాంటి శస్త్రచికిత్సలను సాధారణంగా ఓపెన్ పద్ధతిలో అంటే శరీరాన్ని కోసి చేస్తారు. కానీ శిశువు వయసు దృష్ట్యా అలా చేయలేని పరిస్థితి. కాబట్టి అత్యంత సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను కీహోల్ పద్ధతిలో చేసినట్లు డాక్టర్ తెలిపారు. దాని ద్వారా ముందుగా వేర్వేరు ప్రదేశాలలో ఉన్న కీలక అవయవాలైన మూత్రపిండాలు, కాలేయం, కడుపు లాంటివాటిని వాటి వాటి స్థానాల్లోకి ప్రవేశపెట్టాం. తర్వాత అవి మళ్లీ పైకి రాకుండా కృత్రిమ డయాఫ్రంను ఏర్పాటుచేశామన్నారు. తద్వారా శిశువు ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా కాపాడగలిగామని డాక్టర్ సతీష్ గంట తెలిపారు.
ఇంత పెద్ద ఆపరేషన్ జరిగింది కాబట్టి శిశువును దాదాపు మూడు లేదా నాలుగు నెలల పాటు హాస్పిటల్స్ ఉంచాల్సిన పరిస్థితి ఉండేది...కానీ అన్ని విధాలా శిశువును బాగు చేసి కేవలం మూడున్నర వారాల్లోనే తల్లిదండ్రులకు అప్పగించినట్లు డాక్టర్ తెలిపారు. ఆ పేరెంట్స్ సంపూర్ణ ఆరోగ్యంతో వున్న బిడ్డను డిశ్చార్జీ చేసి ఆనందంగా ఇంటికి తీసుకుని వెళుతున్నారని డాక్టర్ తెలిపారు.
'ఇలాంటి సమస్య రావడమే చాలా అరుదుగా ఉంటుంది. పైగా ఇలాంటప్పుడు చాలావరకు ఓపెన్ పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేస్తారు. దానివల్ల రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. అందుకని ఇక్కడ ఈ కేసులో శిశువు ప్రాణాలను కాపాడాలని.. అందులోనూ వీలైనంత తక్కువగా రక్తస్రావం ఉండేలా చూడాలని భావించి మేం కీహోల్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేశాం' అని డాక్టర్ సతీష్ గంట తెలిపారు.
Hyderabad
ఆ శిశువు పేరెంట్స్ మాటలివే..
“మా శిశువుకు ఇంత పెద్ద సమస్య ఉందని తెలిసి పైప్రాణాలు పైనే పోయాయి. దీనికి అసలు చికిత్స ఉందా, ఉంటే ఎవరు చేస్తారని పలు రకాలుగా ప్రయత్నించాం. చివరకు బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్స్ అండ్ షి ఆస్పత్రి గురించి తెలిసి ఇక్కడకు వచ్చాం. ఇక్కడి వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఎంతో బాగా శస్త్రచికిత్స చేశారు. పెద్ద పెద్ద కోతలు లేకుండా మూడు చిన్న రంధ్రాలు చేసి, దాంట్లోంచే అంతా నయం చేసేశారు. మా బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులకు, లిటిల్ స్టార్స్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి యాజమాన్యానికి, ఇతర సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము” అని శిశువు తండ్రి చెప్పారు. ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని ఆనందంగా వెళ్లిపోయారు.