దీన్ని యాటిట్యూడ్ అంటారో.. తలపొగరు అంటారో.. మొత్తానికి రచ్చ రచ్చయింది కదయ్యా పుష్పా?
అల్లు అర్జున్ ... ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పుష్ఫ2 సక్సెస్ తో పాజిటివ్ గా, సంధ్య థియేటర్ ఘటన తర్వాత నెగెటివ్ గా ఆయనపేరు చర్చల్లో నిలిచింది. అల్లు అర్జున్ తీరు ఇంతటి వివాదాస్పదం కావడానికి యాటిట్యూడే కారణం. అదెలాగో తెలుసుకుందాం.
Allu Arjun
Allu Arjun : అల్లు అర్జున్ ... జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తెలుగు హీరో. అతడు ఎంతగొప్ప నటుడో తెలుసుకోడానికి ఈ అవార్డు చాలు. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన నటుల్లో అల్లు అర్జున్ ఒకడు... ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కేవలం పుష్ఫ సినిమాతోనే అతడు పాన్ ఇండియా హీరోగా మారలేదు... అంతకు ముందునుండే అతడికి కేరళతో పాటు హిందీలో మంచి ఫాలోయింగ్ వుంది. అతడి నటనకు తెలుగు ప్రజలే కాదు దేశ ప్రజలంతా ఫిదా అవుతారు. గంగోత్రి నుండి పుష్ఫ2 వరకు అల్లు అర్జున్ జర్నీ చూస్తే అధ:పాతాళం నుండి ఆకాశానికి ఎదిగినట్లు వుంటుంది. నటుడిగా అతడి పరిణతిని చూస్తు హ్యాట్సాఫ్ అనాల్సిందే.
నటుడిగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్... ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఎదిగే కొద్ది ఒదిగి వుండాలనే విషయాన్ని అతడు మరిచాడు. అందుకే ఎంత గొప్ప నటుడిగా పేరుతెచ్చుకున్నా మెగా హీరోల్లా క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు. ఇందుకు అతడి యాటిట్యూడే కారణం... ఇదే అతడిని మెగా కుటుంబానికి దూరం చేసింది... ఇప్పుడు అభిమానుల ముందు ముద్దాయిగా నిలబెట్టింది. పుష్ఫ హిట్ తర్వాత అల్లు అర్జున్ తీరు మరింత మారిపోయింది... తనకంటే ఎవరూ గొప్పకాదు అనే పొగరు తలకెక్కింది. అదే అతడి కొంప ముంచింది.
పుష్ఫ2 మూవీ అల్లు అర్జున్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో అతడు తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఇంత భారీ హిట్ ఖాతాలో పడ్డా అతడు ఆనందించే పరిస్థితి లేకుండా పోయింది. ఇందుకు అతడి యాటిట్యూడే కారణం. చివరకు తగ్గేదేలే అన్నోడు కాస్త ఎంతలా తగ్గాల్సి వస్తోంది అందరం చూస్తున్నాం. ఇలా కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితేగాని తత్వం బోధపడలేదు. పుష్ఫ యాటిట్యూట్ రీల్ కే పరిమితం చేయాలని... రియల్ లైఫ్ లో గంగోత్రి టైమ్ లో అనిగిమనిగి వున్న అల్లు అర్జున్ లా వుండాలని అర్థమయ్యింది.
Allu Arjun
అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఎక్కడ బైటపడింది :
చెప్పను బ్రదర్ ... ఈ మాటలు వింటే గుర్తుకువచ్చేంది అల్లు అర్జునే. ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలన్న మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ చెప్పిన సమాధానం. అతడు మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చి అల్లు వారి హీరోగా గుర్తింపు తెచ్చుకోడానికి చేసిన ప్రయత్నమిది. కానీ ఇది బెడిసికొట్టింది... అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ కు దూరం చేసింది. అంతేకాదు పవన్ కల్యాణ్ వీరాభిమానులను అల్లు అర్జున్ ని శతృవుగా మార్చింది.
అయితే గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరు చెప్పుకుని ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడిలా యాటిట్యూట్ చూపించడం ఏంటనేది మెగా ఫ్యాన్స్ వాదన. అతడు తీరు మార్చుకోవాలని... రెండు హిట్స్ పడగానే ఇంత గర్వంగా మాట్లాడతాడా అంటూ సీరియస్ అయ్యారు. తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ను అవమానించేలా వ్యవహరించాడంటూ అల్లు అర్జున్ పై కోపం పెంచుకున్నారు మెగా ఫ్యాన్స్.
అప్పటినుండి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లనే అల్లు అర్జున్ ఎదిరించడం... వారిపై అల్లు ఫ్యాన్స్ తప్పుడు ప్రచారాలు చేయడం వివాదం పీక్స్ కు చేరింది. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి తెరపైకి వచ్చింది.
Allu Arjun
ఏపి ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఓవరాక్షన్ చేసారా?
ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసారు పవన్ కల్యాణ్. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి వైసిపిని దెబ్బతీసాయి. ఈ ఎన్నికల వేళ తెలుగు సినిమారంగం మొత్తం పవన్ కల్యాణ్ పక్షాన నిలిచింది.మెగా హీరోలతో పాటు కొందరు నటులు స్వయంగా వెళ్లి పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
అయితే అల్లు అర్జున్ ఇక్కడకూడా తన యాటిట్యూడ్ చూపించాడు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి నుండి పోటీచేస్తున్న శిల్పా రవించంద్రారెడ్డికి మద్దతుగా నిలిచాడు. సరిగ్గా పోలింగ్ కు ముందు స్వయంగా శిల్ప ఇంటికి వెళ్లాడు. ఇలా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్ పోటీలో వుండగా అల్లు అర్జున్ స్నేహితుడైన శిల్పాకు మద్దతుగా నిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇలా ఎన్నికల వేళ పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరించిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కోపం మరింత పెరిగింది. ఇదే ఎఫెక్ట్ తాజాగా పుష్ఫ2 సినిమాపై పడింది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో పుష్ప సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. చివరకు చెప్పను బ్రో అన్న అల్లు అర్జున్ నోటినుండే పవన్ కల్యాణ్ పేరు వినిపించేలా చేసారు.
Allu Arjun
ఈ యాటిట్యూట్ అల్లు అర్జున్ కొంప ముంచిందా?:
ప్యాన్ ఇండియా స్టార్... ఈ టైటిల్ అల్లు అర్జున్ లో యాటిట్యూడ్ ను మరింత పెంచింది. పుష్ఫ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ లాంటి భారీ ఫ్యాన్ బేస్ వున్న హీరోలతో పోల్చుకోవడం ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు ఆయన పరిస్థితికి కారణమైందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు సినీప్రియులు. తనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో చూపించేందుకే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడు... అతడి రోడ్ షో ను బట్టే ఈ విషయం అర్థమవుతోంది.
ఇక తొక్కిసలాటలో రేవతి, తేజ గాయపడిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఏమాత్రం తగ్గలేదని పోలీసులు చెబుతున్నారు. అభిమానుల మధ్యను కూర్చుని సినిమా పూర్తిగా చూసేందుకు ప్రయత్నించాడట. దీన్నిబట్టి ఆయన ఎంతటి అటెన్షన్ కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. ఈ ఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్నది ఆయన ప్రెస్ మీట్ ను బట్టి తెలుస్తోంది.
చివరకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, రేవతి మృతి, శ్రీతేజకు పరిస్థితిపై స్పందించారు. అల్లు అర్జున్ ను తీరును తప్పుబడుతూ కడిగిపారేసారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు, ప్రభుత్వానిదే తప్పన్నట్లుగా మాట్లాడాడు. ఈ సందర్భంలో ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని... ఆ హావభావాలు, మాటలు ఆయన యాటిట్యూడ్ ను మరోసారి బైటపెట్టాయని అంటున్నారు. ఇలాంటి వ్యవహారాలతోనే అల్లు అర్జున్ పరిస్థితిని ఇంత సీరియస్ చేసుకున్నారని... అయినా ఆయన మారడంలేదని చాలామంది అభిప్రాయం.