Airtel: జీపీఎస్ కంటే ఇది 100 రెట్లు ఎక్కువ.. ఎయిర్‌టెల్‌లో అధునాతన ఏఐ సేవలు.
Airtel: ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ మరో అధునాతన సేవలను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్-స్విఫ్ట్ నావిగేషన్ భాగస్వామ్యం
మంగళవారం ఎయిర్‌టెల్ బిజినెస్ సంస్థ, స్విఫ్ట్ నావిగేషన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఎయిర్‌టెల్-స్కైలార్క్ అనే క్లౌడ్ ఆధారిత, AI/ML శక్తితో నడిచే లొకేషన్ సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ GNSS (Global Navigation Satellite Systems) కంటే ఈ సేవ 100 రెట్లు ఎక్కువ ఖచ్చితత్వం ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
సాంకేతికత ప్రత్యేకత
ఈ సర్వీస్‌లో స్విఫ్ట్ నావిగేషన్ స్కైలార్క్ టెక్నాలజీని, ఎయిర్‌టెల్ కి చెందిన దేశవ్యాప్తంగా ఉన్న 4G/5G నెట్‌వర్క్‌తో కలిపారు. దీని వల్ల సెంటీమీటర్ స్థాయి ఖచ్చితమైన లొకేషన్ డేటా అందిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రాణాంతక పరిస్థితుల్లో, అత్యవసర సర్వీసులు, పెద్ద స్థాయి లొకేషన్ ఆధారిత అప్లికేషన్లకు చాలా ఉపయోగపడనుంది. ఈ విషయమై ఎయిర్‌టెల్ బిజినెస్ డైరెక్టర్ & సీఈఓ శరత్ సిన్హా మాట్లాడుతూ.. “మన దేశంలో సంక్లిష్టమైన గల్లీలు, వీధుల్లో ఒక సెంటీమీటర్ తేడా కూడా ప్రాణ రక్షణలో కీలకమవుతుంది. ఈ సాంకేతికత అత్యవసర సేవలకే కాకుండా పరిశ్రమలకు కొత్త ప్రమాణాలను తీసుకు వస్తుంది. అలాగే ఆటోనమస్ వాహనాలు, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్లలో వేగంగా కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది” అని అన్నారు.
ఎక్కడ ఉపయోగపడుతుంది?
ఎయిర్‌టెల్-స్కైలార్క్ సేవను అనేక రంగాల్లో వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా..
* ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్స్, ఆటోనమస్ వాహనాలు – రోడ్డు భద్రత కోసం.
* స్మార్ట్ టోల్లింగ్ – లేన్ లెవల్, అవరోధంలేని టోల్ వసూలు కోసం.
* ఫ్లీట్ మేనేజ్‌మెంట్, చివరి దశ డెలివరీల్లో కచ్చితత్వం కోసం.
* రైల్వే భద్రత మెరుగుపరచడానికి.
* ప్రెసిషన్ అగ్రికల్చర్ – ఎరువులు, విత్తనాల వాడకాన్ని ఆప్టిమైజ్ చేయడానికి.
* మొబైల్ యాప్‌లకు అధునాతన రియల్ టైమ్ లొకేషన్ సేవలు అందించడానికి.
ప్రారంభ ప్రణాళికలు
మొదటగా ఈ సర్వీస్‌ను 35,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో (NCR – నేషనల్ క్యాపిటల్ రీజియన్) లో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత దశలవారీగా పాన్-ఇండియా స్థాయిలో విస్తరించే ప్రణాళిక ఉంది.
సైబర్ మోసాలపై ఎయిర్‌టెల్ చర్యలు
ఇదిలా ఉంటే.. ఎయిర్‌టెల్ తన యాంటీ-ఫ్రాడ్ (Anti-Fraud) చర్యల ద్వారా సైబర్ నేరాలను గణనీయంగా తగ్గించిందని తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్ 2024 నుంచి జూన్ 2025 వరకు ఎయిర్‌టెల్ వినియోగదారుల ఆర్థిక నష్టాలు 68.7% తగ్గాయి. మొత్తం ఫిర్యాదులు 14.3% తగ్గాయి.