- Home
- Technology
- Sridhar Vembu: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి, మెటాకు చుక్కలు చూపించే స్థాయికి ఎదిగి.. ఎవరీ శ్రీధర్?
Sridhar Vembu: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి, మెటాకు చుక్కలు చూపించే స్థాయికి ఎదిగి.. ఎవరీ శ్రీధర్?
Sridhar Vembu: మేక్ ఇన్ ఇండియా నినాదం బాగా వినిపిస్తోంది. ఇది కేవలం వస్తువుల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా సాఫ్ట్‌వేర్ రంగానికి కూడా వ్యాపిస్తోంది. ఈ వరుసలో ముందుంది జోహో. ఈ కంపెనీ సీఈఓకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

ఎవరీ శ్రీధర్ వెంబు.?
శ్రీధర్ వెంబు జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు. అమెరికాలో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు శ్రీధర్. చేతిలో పెద్ద మొత్తంలో నిధులు లేకపోయినా సొంతంగా కంపెనీ ప్రారంభించాలనే పట్టుదలతో భారత్ వచ్చారు. అనంతరం గ్రామీణ భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేసి విజయవంతమయ్యాడు. ప్రస్తుతం అరట్టై యాప్‌తో దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
చదువు, కెరీర్
ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన శ్రీధర్.. సిలికాన్ వ్యాలీ లో టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. ఎంఎన్‌సీ కంపెనీలు, పెద్ద పెద్ద నగరాల్లోనే అద్భుతాలు జరుగుతాయని శ్రీధర్ నమ్మలేదు. చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రతిభను గుర్తించి అక్కడి నుంచి కూడా ప్రపంచ స్థాయి కంపెనీ నిర్మించాలి అనేది ఆయన ఆలోచన.
ఇలా మొదలైంది..
అప్పటి వరకు అమెరికాలో ఉన్న శ్రీధర్ 2000 ప్రారంభంలో భారత్‌కు తిరిగొచ్చి తమిళనాడులోని తన స్వస్థలంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచే తన కంపెనీ ఆలోచనను ప్రారంభించారు. తొలుత AdventNet Inc. గా ప్రారంభమై, తర్వాత Zoho Corporation గా రీబ్రాండ్ అయింది. ఇతర స్టార్టప్‌లకు భిన్నంగా, జోహోకి ఎటువంటి వేంచర్ కాపిటల్ అవసరం లేకుండా కంపెనీ తన స్వంత ఆదాయం, వనరుల ద్వారా పెరిగింది.
స్థానిక ప్రతిభకు శిక్షణ ఇవ్వడం
శ్రీధర్ ఉద్యోగాల నియామకంలో ఒక ప్రత్యేకమైన విధానం అవలంబించారు. కేవలం ఇంజనీర్లను మాత్రమే కాకుండా, స్థానిక యువతను శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి నేర్పడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రోగ్రాములు, స్కూల్స్ ఏర్పాటు చేసి, యువతను Zohoలో చేరేలా చేశారు.. ఈ విధానం ద్వారా గ్రామాల నుంచి కూడా ప్రపంచ స్థాయి ప్రతిభ బయటకు వచ్చింది.
గ్లోబల్ సాఫ్ట్‌వేర్ లీడర్
ఈ రోజు, Zoho 50కి పైగా క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అందిస్తోంది. 180కి పైగా దేశాల్లో 100 మిలియన్లకు పైగా యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇమెయిల్, అకౌంటింగ్, CRM, HR మేనేజ్‌మెంట్ వంటి అన్ని రంగాల్లో Zoho టూల్స్ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి గ్రామీణ కేంద్రిత వ్యాపార మోడెల్ యువ వ్యాపారవేత్తలకు ఒక ప్రేరణగా నిలుస్తోంది.