గిరిజన గ్రామాల్లో డిజిటల్ విప్లవం.. 4జి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసిన రిలయన్స్ జియో
విజయవాడ, 22 సెప్టెంబర్ 2021: భారతదేశంలో టెలికాం రంగ రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన గ్రామాలకు చేరుకుంది. రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో దాదాపు 1529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు ఇప్పుడు 4 జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి.
తన నెట్వర్క్ విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, జి.మాడుగుల, పేద బయలు, జి.కె.వీధి, డుంబ్రిగూడ వంటి మారుమూల గ్రామాలకు ఇప్పుడు హై-స్పీడ్ 4 జి సేవలు అందిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాలలో నివసించే విద్యార్థులు ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా వారి విద్యను కొనసాగించడానికి, మరియు ప్రజలు సురక్షితంగా ఉండడానికి సహాయపడుతోంది.
కోవిడ్ మహమ్మారి సామాన్యులు సంభాషించే విధానాన్ని మార్చింది. ప్రజలు షాపింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, నేర్చుకోవడం, వినోదం పొందడం మరియు ఆర్థికంగా లావాదేవీలు చేసే విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఈ పరివర్తన కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ మార్కెట్లకు కూడా విస్తరించింది. గతంలో 3G సేవలు ఎక్కువగా పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆలా కాకుండా టెలికాం కంపెనీలు ఇప్పుడు 4G హైస్పీడ్ సేవలను కొన్ని వందల మంది జనాభా కలిగిన గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.
భారతదేశంలో అతి పెద్ద 4G సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో తన విస్తృతమైన నెట్వర్క్ మరియు అందుబాటు ధరలో జియోఫోన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని కస్టమర్లు సైతం ఈ సేవలు, వాటి ప్రయోజనాలను పొందగలుగుతున్నారు.
భారత ప్రభుత్వం టెలి కమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇటీవల నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్న రిలయన్స్ జియో దేశంలోని మొత్తం 22 సర్కిళ్లలో అదనపు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ లో సైతం 850MHZ, 1800MHZ మరియు 2300MHZ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన తన 10462 సైట్‌లలో 850MHz బ్యాండ్ లో 6.25 MHz , 1800MHz బ్యాండ్ లో 4.2 MHz , మరియు 2300 MHz బ్యాండ్ లో 10 MHz స్పెక్ట్రమ్ ను అదనంగా జోడించింది.