ఫోన్ లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. పిడుగుపాటు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు!
వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. కానీ అవి ఎప్పుడు, ఎక్కడ పడతాయో చెప్పడం కష్టం. పిడుగుపాటు వల్ల చాలామంది చనిపోతుంటారు. కానీ ఇప్పుడు పిడుగు ఎక్కడ పడుతుందో చెప్పొచ్చు. మనల్ని మనం రక్షించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

పిడుగు పడే సమాచారం ముందుగానే..
పిడుగుపాటు వల్ల ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఎక్కువగా రైతులు, పొలం పనులకు వెళ్లే కూలీలు, జీవాల కాపారులు పిడుగుపాటుకు గురవుతుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. మన చుట్టుపక్కల పిడుగు పడే అవకాశం ఉందనే సమాచారాన్ని మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
పిడుగు పడుతుందో లేదో చెప్పే యాప్
టెక్నాలజీ రోజురోజుకు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనకు తెలుసు. ఒక్క ఫోన్ ద్వారా ఆల్ మోస్ట్ అన్ని పనులు మనం కూర్చున్న చోటు నుంచే చక్కపెట్టుకునే వెసులుబాటు వచ్చేసింది. కొన్ని యాప్స్ ఇందుకు ఎంతగానో సహాయపడతున్నాయి. అలా పిడుగుపాటు నుంచి కూడా మన ప్రాణాల్ని రక్షించే ఒక యాప్ ఉంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దామిని యాప్
దామిని లైటింగ్ అలర్ట్.. ఈ యాప్ పిడుగు వంటి విపత్కర పరిస్థితుల గురించి మనకు ముందుగానే సమాచారం ఇస్తుంది. పిడుగు పాటును ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ ఫోన్ లో ఈ యాప్ ఉన్నట్లయితే అర్ధగంట ముందుగానే మీరున్న ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీన్ని మనం గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ చేసుకున్నాక పేరు, మొబైల్ నెంబర్‌ని రిజిస్టర్ చేసుకోవాలి.
మొబైల్ కి నోటిఫికేషన్
దామిని యాప్ జీపీఎస్ ఆధారంగా మీరు ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఆ పరిధిలో పిడుగులు పడే అవకాశాలపై తక్షణ సమాచారం అందిస్తుంది. ఇది లైటెనింగ్ డిటెక్షన్ నెట్ వర్క్స్ ద్వారా సేకరించిన డేటాను ప్రాసెస్ చేసి.. మీ ప్రాంతంలో 20 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉన్నపుడు మొబైల్‌కి నోటిఫికేషన్ పంపిస్తుంది.
ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో సమాచారం అందించగలదు. అంతేకాదు ఈ యాప్‌లో పిడుగు పడినప్పుడు ఎలా స్పందించాలి, ఎక్కడ తలదాచుకోవాలి వంటి సూచనలు కూడా ఉంటాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, పనికోసం బయటకు వెళ్లేవారు.. వెళ్లేముందు ఈ యాప్ ద్వారా పరిస్థితి తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. దామిని యాప్ పనిచేయాలంటే ఫోన్‌లో GPS ఆన్ చేసి ఉంచాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. యాప్‌లో నోటిఫికేషన్లు ఆన్ చేయాలి.