అదిరిపోయే ఫీచర్లతో ఆపిల్ నుంచి కొత్త ఫోన్.. ఐఫోన్ ఎయిర్ ధరెంతో తెలుసా?
iPhone Air India price: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్తగా ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అతి పలుచని, అతి తేలికైన ఐఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ ఎయిర్ ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు, ధర వివరాలు ఇపుడు తెలుసుకుందాం.

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డిజైన్, ప్రత్యేకతలు ఏంటి?
iPhone Air: ఆపిల్ తాజాగా పరిచయం చేసిన ఐఫోన్ ఎయిర్ ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్త మోడల్ ను తీసుకొచ్చింది. అదే ఐఫోన్ ఎయిర్. ఇది ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్‌లలో అతి పలుచనిగా (5.6 మి.మీ), అతి తేలికైన (165 గ్రాములు) ఫోన్ గా గుర్తింపు పొందింది.
టైటానియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్ బ్యాక్‌తో ఇది అత్యంత బలంగా ఉంటుంది. ముందు భాగంలో సిరామిక్ షీల్డ్ 2 వాడటం వల్ల గీతలు పడే అవకాశం మూడు రెట్లు తగ్గిందని కంపెనీ పేర్కొంది. అలాగే, ఇది IP68 రేటింగ్‌తో నీరు, దుమ్ము నిరోధకత కలిగిఉంది.
ఈ మోడల్ పూర్తిగా eSIM-only డివైస్‌గానే అందుబాటులో ఉంది. అలాగే, ప్రత్యేకమైన యాక్షన్ బటన్ కూడా తీసుకొచ్చారు. ఇది స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ అనే నాలుగు ఆకర్షణీయ రంగుల్లో తీసుకొచ్చారు.
ఐఫోన్ 17 ఎయిర్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ ఎయిర్ లో A19 ప్రో చిప్ ను ఉపయోగించారు. 6.5 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేలో 120Hz ProMotion టెక్నాలజీ ఉంది. 2736×1260 పిక్సెల్ రిజల్యూషన్, 3,000 నిట్స్ పీక్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్టోరేజ్ ఆప్షన్లు 256GB, 512GB, 1TBగా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, Bluetooth 6, Thread, C1X మోడెమ్ వాడారు. తక్కువ బరువుతో ఉన్నప్పటికీ, ఇది ప్రో మోడల్ స్థాయి పనితీరును అందిస్తుంది.
ఐఫోన్ ఎయిర్ కెమెరా అప్‌డేట్స్
ఐఫోన్ ఎయర్ లో రియర్ కెమెరా: 48MP ఫ్యూజన్ సిస్టమ్ కలిగిన ఈ కెమెరా నాలుగు లెన్స్‌ల మాదిరిగా పనిచేస్తుంది. 28mm, 35mm ఫోకల్ లెన్త్‌లతో పాటు 2x టెలిఫోటో లెన్స్ లా కూడా వర్క్ చేస్తుంది. కొత్త ఫోటానిక్ ఇంజిన్ ఫోటోలలో రంగులను మరింత సహజంగా, స్పష్టంగా అందిస్తుంది.
ఫ్రంట్ కెమెరా: 18MP సెంటర్ స్టేజ్ కెమెరా స్క్వేర్ సెన్సార్‌తో వస్తుంది. దీనివల్ల ఫోన్‌ను నిలువుగా పట్టుకున్నప్పటికీ ల్యాండ్‌స్కేప్ ఫోటోలు, వీడియోలు తీయవచ్చు. గ్రూప్ ఫోటోల కోసం AI ఆటోమేటిక్ గా ఫ్రేమ్‌ను మారుస్తుంది.
ఐఫోన్ ఎయిర్ వీడియో ఫీచర్లు: 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ (60fps వరకు), డ్యూయల్ క్యాప్చర్ (ఫ్రంట్-రియర్ కెమెరా ఒకేసారి రికార్డ్ చేయడం), స్పేషియల్ ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్, ఆడియో మిక్స్ ఫీచర్ ఉన్నాయి.
ఐఫోన్ ఎయిర్ బ్యాటరీ లైఫ్ ఎంత?
ఆపిల్ ప్రకారం ఐఫోన్ ఎయిర్ ఆల్ డే బ్యాటరీ లైఫ్ కలిగివుంటుంది. సుమారు 27 గంటల వీడియో ప్లేబ్యాక్, 22 గంటల స్ట్రీమింగ్ అందిస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం సుమారు 3,149 mAhగా అంచనా.
కంపెనీ ప్రత్యేకంగా స్లిమ్ MagSafe బ్యాటరీ ప్యాక్ ను కూడా విడుదల చేసింది. దీన్ని జతచేస్తే వీడియో ప్లేబ్యాక్ 40 గంటలకు పెరుగుతుంది. అయితే, దీనివల్ల ఫోన్ సన్నగా ఉండే డిజైన్‌కు కొంత బరువు యాడ్ అవుతుంది.
ఐఫోన్ ఎయిర్ ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?
ఐఫోన్ ఎయిర్ సెప్టెంబర్ 9, 2025న అధికారికంగా ప్రకటించారు. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 19 నుంచి స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
భారత్‌లో ఐఫోన్ ఎయిర్ ధరలు
• 256GB: ₹1,19,900
• 512GB: ₹1,39,900
• 1TB: ₹1,59,900
దీనికి MagSafe బ్యాటరీ ప్యాక్ ధర ₹11,900.
సన్నగా, తేలికగా ఉండే డిజైన్, ప్రో స్థాయి కెమెరా, శక్తివంతమైన పనితీరును కోరుకునే ఐఫోన్ లవర్స్ కు ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.