మద్యం మత్తులో ఢిల్లీ పోలీసులు మమల్ని నెట్టివేసి, అవమానించేలా మాట్లాడారు..: రెజర్ల ఆవేదన..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెజర్ల దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజర్ల కోసం బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వాటిని రెజర్లకు అందజేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో అక్కడ పోలీసులకు, సోమ్‌నాథ్ భారతి అనుచరులకు వాగ్వాదం చోటుచేసుకున్నారు. ఈ క్రమంలోనే రెజర్లు కూడా వారికి మద్దతుగా నిలవడంతో అక్కడ ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది.
రాత్రి 11 గంటల ప్రాంతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజర్లకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు రెజర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులపై రెజర్లు సంచలన ఆరోపణలు చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రెజ్లర్‌లలో ఒకరిని పోలీసులు కొట్టి గాయపరిచారని ఒలంపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా ఆరోపించారు.
బజరంగ్ పునియా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌లతో సహా మహిళా రెజ్లర్లను పోలీసులు దుర్భాషలాడారని ఆరోపించారు. ‘‘వాళ్ళను చూడండి.. వారు తాగి ఉన్నారు’’ అని నిరసనకారులచే చుట్టుముట్టబడిన ఇద్దరు పోలీసు అధికారులను చూపిస్తూ బజరంగ్ పునియా ఆరోపణలు చేశారు.
మరోవైపు కన్నీళ్లు పెట్టుకున్న సాక్షి మాలిక్‌ను వినేష్ ఫోగట్ ఓదార్చడం కనిపించింది. పోలీసులు తనను నెట్టారని.. దుర్భాషలాడారని ఆమె ఆరోపించారు. ‘‘మీరు మమ్మల్ని చంపాలనుకుంటే.. చంపండి’’అని వినేష్ ఫోగట్ అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి రోజులు చూడటానికా తాము ఇన్ని పతకాలు గెలిచిందని వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఇద్దరు రెజ్లర్లపై పోలీసు అధికారి దాడి చేశారని.. మిగిలిన పోలీసులు చూస్తూ మూగ ప్రేక్షకులుగా ఉండిపోయారని ఆమె ఆరోపించారు.
‘‘ఈ రోజు చూడ్డానికేనా మేము దేశానికి పతకాలు సాధించామా? మేం తిండి కూడా తినలేదు. స్త్రీలను దుర్భాషలాడే హక్కు ప్రతి పురుషునికి ఉందా? ఈ పోలీసులు తుపాకులు పట్టుకున్నారు.. వారు మమ్మల్ని చంపగలరు’’ అని వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మగ అధికారులు మమ్మల్ని అలా ఎలా నెట్టగలరని ప్రశ్నించారు. తాము నేరస్తులం కాదని చెప్పారు.
ఇదిలా ఉంటే.. తమకు మద్దతుగా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని బజరంగ్ పునియా కోరారు. ఇది మన ఆడపిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. బ్రిజ్ భూషణ్ లాంటి వ్యక్తులు నేరస్థుడైనప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. ఇక, ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.