SRH షాకింగ్ ట్విస్ట్.. సునామీ బ్యాటర్ ఔట్.. కావ్యా పాప సెన్సేషన్ నిర్ణయం !
SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టులో కీలక మార్పులు చేస్తోంది. జట్టులోని అత్యంత ఖరీదైన ప్లేయర్లను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉందని సమాచారం. అసలు కావ్యా పాప వ్యూహాం ఏంటి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 వేలం ముందు సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టులో పెద్ద మార్పులు జరగనున్నాయనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ ఆధ్వర్యంలో జట్టు సమతుల్యతను మెరుగుపరచాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో 23 కోట్ల భారీ రిటెన్షన్‌తో ఉన్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హైన్రిచ్ క్లాసెన్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో జట్టు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది షాకింగ్ నిర్ణయంగా చెప్పవచ్చు.
23 కోట్ల క్లాసెన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏం ఆలోచన చేస్తోంది?
2025 మెగా వేలం ముందు హెన్రిచ్ క్లాసెన్‌ను 23 కోట్ల రూపాయల భారీ మొత్తంతో రిటైన్ చేసుకుంది హైదరాబాద్ టీమ్. ఈ మొత్తం జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (₹18 కోట్లు), అభిషేక్ శర్మ (₹14 కోట్లు) కంటే ఎక్కువ. అయితే 2025 సీజన్‌లో క్లాసెన్ వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన చేసినప్పటికీ, ఆరెంజ్ మెన్స్ ఫలితాలు నిరాశ కలిగించాయి. 2024లో రన్నరప్‌గా నిలిచిన ఎస్ఆర్హెచ్, 2025లో ఆరో స్థానంలో ముగించింది. అందుకే మేనేజ్‌మెంట్ ఇప్పుడు బడ్జెట్ సర్దుబాటు దిశగా నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం.
క్లాసెన్ విడుదల వ్యూహాత్మక నిర్ణయమేనా?
క్రికెట్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. హెన్రిచ్ క్లాసెన్ విడుదల నిర్ణయం అతని ప్రతిభపై కాకుండా ఆర్థిక వ్యూహంపై ఆధారపడింది. జట్టులో బౌలింగ్ యూనిట్‌లో బలహీనతలు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లోపాలు బయటపడ్డాయి. 23 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేస్తే, ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌లోని సభ్యులు ప్రస్తుతం రిటెన్షన్ జాబితాను ఫైనల్ చేయడానికి వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.
ధనాధన్ ఇన్నింగ్స్ లతో మ్యాచ్ ను మలుపుతిప్పగల ప్లేయర్ క్లాసెన్
2025 సీజన్‌లో క్లాసెన్ 13 ఇన్నింగ్స్‌లలో 487 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 172.69గా నమోదైంది. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినప్పటికీ, మిగతా బ్యాటర్లు పెద్దగా మద్దతు ఇవ్వలేకపోయారు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అతని ఫామ్ కూడా మిశ్రమంగా ఉంది. ది హండ్రెడ్ 2025లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున కేవలం 151 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ టీమ్ స్మార్ట్ మువ్‌గా క్లాసెన్‌ను విడుదల చేసి తిరిగి 15 కోట్ల వరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చనే చర్చ సాగుతోంది.
బౌలింగ్ యూనిట్ మార్పులపై దృష్టిపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ 2025 సీజన్‌లో బౌలింగ్ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ చెందింది. మహ్మద్ షమీ (₹10 కోట్లు), హర్షల్ పటేల్ (₹8 కోట్లు) లాంటి ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. షమీ కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు, ఎకానమీ రేట్ 11 కంటే ఎక్కువగా ఉంది. హర్షల్ 16 వికెట్లు సాధించినా, ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో స్పిన్ విభాగంలోనూ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. రాహుల్ చాహర్ స్థానంలో కొత్త స్పిన్నర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 వేలం ముందు SRH వ్యూహం ఏమిటి?
జట్టు సమతుల్యత, బౌలింగ్ డెప్త్, మిడిల్ ఆర్డర్ బలహీనతలు.. ఇవన్నీ SRH ముందున్న ప్రధాన సవాళ్లు. క్లాసెన్ లాంటి మ్యాచ్‌విన్నర్‌ను వదిలేయడం పెద్ద రిస్క్ అయినప్పటికీ, ఫ్రాంచైజీ దీన్ని రీసెట్ స్ట్రాటజీగా చూస్తోంది. పెద్ద బడ్జెట్‌తో వేలంలోకి వెళ్లడం ద్వారా పలు కీలక స్థానాలను భర్తీ చేయాలని ఆరెంజ్ ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది.
రాబోయే వారాల్లో దీనిపై తుది నిర్ణయం వెల్లడించనుంది. కానీ హైన్రిచ్ క్లాసెన్ భవిష్యత్తు సన్‌రైజర్స్ జట్టులో కొనసాగుతుందా లేదా అనేది IPL 2026 వేలం వరకు మిస్టరీగానే మిగిలే అవకాశం ఉంది.