'ఆడు కింగ్‌రా.. పక్కాగా కోహ్లీ ప్రపంచకప్ ఆడతాడు..'
Virat Kohli: వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ శతకాల పరంపర కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై రెండు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక శతకంతో అదరగొట్టాడు. చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కోహ్లీ ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు.

విరాట్ వరుస శతకాలు..
వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ వరుస శతకాల మోత మోగిస్తున్నాడు. ఇలా సెంచరీలు చేస్తూ ప్రపంచకప్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నాడు. రాబోయే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్న విరాట్.. ఇటీవల సొంత గడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించి వరుసగా రెండు శతకాలతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపులు..
అలాగే విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీతో మెరిసి ప్రపంచకప్ సన్నద్ధతలో తగ్గేదేలేదని చాటి చెప్పాడు. ఆంధ్రాపై అతడి క్లాస్ ఇన్నింగ్స్‌ను చూసి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. తన శిష్యుడు ఫామ్‌పై స్పందించిన శర్మ.. వన్డే ప్రపంచకప్ ఆడేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
సఫారీ బౌలర్లను ఉతికారేశాడు..
స్వదేశంలో సఫారీ బౌలర్లను ఉతికేస్తూ రెండు సెంచరీలతో తాను రేసులోనే ఉన్నానని ప్రకటించిన విరాట్.. దేశవాళీలోనూ ధమాకా ఇన్నింగ్స్ ఆడాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు శతక్కొట్టిన విరాట్.. వరల్డ్ కప్ కు సిద్ధంగా ఉన్నాడని అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అన్నాడు.
దేశవాళీలో రీ-ఎంట్రీ.. సెంచరీతో దుమ్ముదులిపాడు..
సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన విరాట్.. ఏ మాత్రం తడబడకుండా మూడంకెల స్కోర్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న క్రికెటర్ కోహ్లీనేనని శర్మ పేర్కొన్నాడు. కోహ్లీకి ఢిల్లీ క్రికెట్ అకాడమీలో రెండు సంవత్సరాలు శర్మ కోచింగ్ ఇచ్చాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు దేశవాళీలో ఆడేందుకు అంగీకరించిన కోహ్లీ.. ఆంధ్రా బౌలర్లకు తన క్లాస్ ఆటను చూపించాడు. ఈ ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ 101 బంతుల్లోనే 131 పరుగులు సాధించాడు. 12 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడిన ఈ రన్ మెషిన్.. ఢిల్లీ విజయంలో కీలకంగా మారాడు.
లిస్టు-ఏ సచిన్ రికార్డు బ్రేక్..
అంతేకాదు లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగుల క్లబ్‌లో చేరి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 391 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయికి చేరుకోగా, కోహ్లీ కేవలం 330 ఇన్నింగ్స్‌లోనే ఈ క్లబ్‌లో చేరాడు. విజయ్ హజారే ట్రోఫీలోరెండో మ్యాచ్ ఆడిన కోహ్లీ 61 బంతుల్లోనే 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తో విరాట్ కోహ్లీ రాబోయే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

