టీమిండియాకి తోపు బౌలర్.. కానీ విరాట్‌కి పిల్లబచ్చా.. ఆ ప్లేయర్ ఎవరంటే.?
Virat Kohli: ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఐదేళ్లుగా నెంబర్ వన్ టెస్ట్ టీమ్‌గా నిలిచిన భారత్‌ను అతను అద్భుతంగా నడిపించాడు.

టెస్ట్ కెప్టెన్సీ వదిలేసి నాలుగేళ్లు
విరాట్ కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని నాలుగేళ్లు పూర్తవుతోంది. కొంతమంది క్రికెట్ అభిమానుల దృష్టిలో ఐసీసీ టైటిల్ ఒక్కటి కూడా గెలవలేకపోవడంతో విరాట్ కోహ్లీ ఓ ఫెయిల్యూర్ కెప్టెన్. అయితే, టీమిండియా టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన ప్రతీసారీ, ముఖ్యంగా స్వదేశంలో ఓటములు ఎదురైనప్పుడు, అభిమానులు విరాట్ కోహ్లీ సారథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు టెస్టుల్లో ఓ తిరుగులేని శక్తిగా అవతరించడమే.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా పులి..
విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత టెస్ట్ జట్టు వరుసగా ఐదేళ్లుగా నెంబర్ వన్ టెస్ట్ టీమ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను టెస్ట్ సిరీస్‌లో ఓడించడం, స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడాలంటే ప్రపంచంలోని టాప్ జట్లకు కూడా చెమటలు పట్టించడం లాంటివి కోహ్లీ టైంలోనే జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నప్పుడు భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉండేది. అలాంటి జట్టును ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేర్చడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. దీనికి ప్రధాన కారణం బౌలింగ్ విభాగమే.
అప్పుడు తోపు బౌలర్లు..
కోహ్లీ కెప్టెన్సీలో ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు భారత జట్టులోకి వచ్చి ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఎనిమిదేళ్ల వ్యవధిలో స్వదేశంలో కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. అయితే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత భారత జట్టు స్వదేశంలో కూడా వరుస ఓటములతో తమ వైభవాన్ని కోల్పోతోంది.
కోహ్లీ సారధ్యంలోనే బుమ్రా ఎంట్రీ
జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోనే అరంగేట్రం చేశాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రాను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలో విరాట్ కోహ్లీకి తెలిసినట్లుగా మిగిలిన కెప్టెన్లకు ఎవ్వరికీ తెలియడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడేటప్పుడు బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్‌తో విరాట్ కోహ్లీకి అవసరమే ఉండేది కాదు. ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ వంటి బౌలర్ల వల్ల ప్రత్యర్థులకు చెమటలు పట్టేవి.
అప్పుడు అశ్విన్ హీరో.. మరి ఇప్పుడు
ముఖ్యంగా ఉమేష్ యాదవ్‌కు ఇండియాలో అద్భుతమైన రికార్డు ఉంది. అతన్ని ఎలా వాడాలో కోహ్లీకి ఓ స్పష్టమైన ప్రణాళిక ఉండేది. ఇక మిగిలిన పనిని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చూసుకునేవాడు. ఇండియాలో ప్రత్యర్థి బ్యాటర్లకు ముప్పతిప్పలు పెట్టేవాడు అశ్విన్. అయితే, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా మారిన తర్వాత ప్రతి టెస్టులోనూ బుమ్రా కావాల్సిందేనని పట్టుబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బౌలర్ల వినియోగానికి, ఇప్పటి వ్యూహానికి మధ్య వ్యత్యాసంగా తెలుస్తోంది.

