ఆస్ట్రేలియాను కంగారెత్తించడానికి సూర్యకుమార్ యాదవ్ మాస్టర్ ప్లాన్
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆసియా కప్ సమంయలోనే ఆస్ట్రేలియా తో పోరు కోసం ప్లాన్ సిద్ధం చేసినట్టు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు.

టీ20 సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా
భారత్–ఆస్ట్రేలియా వన్డే సిరీస్ పూర్తయింది. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లో పోటీ పడనున్నాయి. అక్టోబర్ 29 నుంచి ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డేల్లో ఓటమి ఎదురుకున్న టీమిండియా ఈసారి ప్రతీకారం కోసం సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగనుంది. మ్యాచ్‌కు ఓ రోజు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆసియా కప్‌లోనే వ్యూహం రెడీ
సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆస్ట్రేలియాను ఓడించే ప్లాన్ చాలా ముందుగా సిద్ధమైందని చెప్పారు. “ఆస్ట్రేలియాపై ఎలాంటి వ్యూహంతో ఆడాలనే విషయాన్ని ఆసియా కప్ సమయంలోనే నిర్ణయించుకున్నాం. మేము ఎక్కడ ఆడినా లక్ష్యం ఒక్కటే. ఇదో అద్భుతమైన దేశం. ఇక్కడ క్రికెట్ ఆడటం ఎప్పుడూ సవాల్” అని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు.
ఫామ్ పై ఎలాంటి ఆందోళన లేదన్న సూర్య
గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్ద ఇన్నింగ్స్ లు రాని నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై ప్రశ్నలు రావడం సహజం. అయితే ఆయన మాత్రం ఆందోళన లేకుండా స్టార్ ధోరణి చూపిస్తున్నారు. “నేను బాగా శ్రమ చేస్తున్నాను. ఇండియాలో మంచి ప్రాక్టీస్ సెషన్‌లు చేశాను. ఇక్కడ కూడా 2-3 అద్భుతమైన సెషన్‌లు జరిగాయి. నేను భాగానే ఉన్నాను.. పరుగులు సహజంగానే వస్తాయి. జట్టు లక్ష్యమే నాకు ప్రాధాన్యం” అని సూర్య కుమార్ యాదవ్ అన్నారు.
కంగారెత్తించడానికి ప్రత్యేక బౌలింగ్ ప్లాన్
సూర్యకుమార్ తన సౌతాఫ్రికా టూర్‌ను గుర్తు చేశారు. ఆస్ట్రేలియాను కంగారెత్తించడానికి ప్రత్యేక బౌలింగ్ ప్లాన్ ను సిద్ధం చేసినట్టు తెలిపారు. “గతంలో సౌతాఫ్రికా టూర్‌లో మేము ఒక ఫాస్ట్ బౌలర్, ఒక ఆల్‌రౌండర్, ముగ్గురు స్పిన్నర్లతో ఆడాము. ఇక్కడ కూడా పరిస్థితులు అలాంటివే. ఆసియా కప్ నుంచి మా సన్నాహాలు కొనసాగుతున్నాయి. విదేశాల్లో ఆడుతున్నాం కాబట్టి కొత్తగా ఏమీ అనుకునే పని లేదు” అని సూర్య తెలిపారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో ఆడే ప్రతి మ్యాచ్ సవాల్‌గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. “ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. ప్రేక్షకులకు మంచి వినోదం ఉంటుంది” అని సూర్య విశ్వాసం వ్యక్తం చేశారు.
టీమిండియా పై మిచెల్ మార్ష్ ప్రశంసలు
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా టీమిండియా పై ప్రశంసలు కురిపించారు. “భారత్ అద్భుతమైన జట్టు. మేము వారిని గౌరవిస్తాము. ఈ సిరీస్ రసవత్తరంగా ఉంటుంది. సవాళ్లతో నిండిన ఈ పోటీని ఎదురుచూస్తున్నాం. మా జట్టు లక్ష్యాలకు అనుగుణంగా మేము సిద్ధమవుతున్నాం” అని తెలిపాడు.
భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి టీ20: అక్టోబర్ 29 – కాన్‌బెర్రా
రెండో టీ20: అక్టోబర్ 31 – మెల్‌బోర్న్
మూడో టీ20: నవంబర్ 2 – హోబార్ట్
నాలుగో టీ20: నవంబర్ 6 – గోల్డ్ కోస్ట్
ఐదో టీ20: నవంబర్ 8 – బ్రిస్బేన్
అన్ని మ్యాచ్‌లు భారత ప్రమాణ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం అవుతాయి.