Siraj: గువాహటిలో స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ఘోర అవమానం
Siraj: అసలే దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన బాధలో ఉన్నారు మన క్రికెటర్లు. అలాంటిది టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు గువాహటి విమానాశ్రయంలో ఘోర అవమానం జరిగింది. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్నారు.

సిరాజ్ కోపమొచ్చింది
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గువాహటిలోనే ఇరుక్కుపోయారు. రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్.. దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత గువాహటిలోని లోక్ ప్రియ గోపీనాథ్ బోర్డులోయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాదుకు రావాల్సి ఉంది. ఇందుకోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ విమానం నాలుగు గంటలు పాటు ఆలస్యంగా రావడంతో సిరాజ్ ఆ విమానాశ్రయంలోనే చిక్కుకు పోవాల్సి వచ్చింది. దీంతో విమానా సంస్థపై సిరాజ్ సోషల్ మీడియాలో తన అసంతృప్తిని తెలియజేశారు. ఇంకెప్పుడూ ఈ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించనని తేల్చి చెప్పారు.
సమాచారమైన ఇవ్వాలి కదా
సాధారణంగా విమానం ఆలస్యం అయితే ఎన్ని గంటలు ఆలస్యం అవుతుందో ఎయిర్ లైన్ సిబ్బంది ముందుగానే ప్రయాణికులకు తెలియజేస్తారు. కానీ ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం అవుతున్నట్టు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సిరాజ్ అంటున్నారు. విమానం రాత్రి 7:25 నిమిషాలకు బయలుదేరాల్సి ఉంది.. కానీ నాలుగు గంటలు గడుస్తున్నా విమానం జాడే లేదు. ప్రయాణికులు ఎంత ప్రశ్నిస్తున్నప్పటికీ విమాన సిబ్బంది సరైన వివరణ కూడా ఇవ్వలేదని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో విమర్శించారు.
వరస్ట్ అనుభవం
తన జీవితంలో అత్యంత వరస్ట్ విమాన అనుభవం ఇదేనని సిరాజ్ పేర్కొన్నారు. సమాచారం ఇవ్వకుండా, నాలుగు గంటల పాటు ఏం జరుగుతుందో తెలియకుండా విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... కనీసం ఎయిర్ ఇండియా సంస్థ బాధ్యతను కూడా తీసుకోలేదని సిరాజ్ చెప్పారు. ఇతను తన ఎక్స్ ఖాతాలో ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘ఎయిర్ ఇండియా విమానం గువాహటి నుండి హైదరాబాదుకు రాత్రి 7:25 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయినప్పటికీ ఎయిర్ లైన్ నుండి ఎటువంటి సమాచారం లేదు విమానాన్ని చాలా ఆలస్యం చేశారు. నాలుగు గంటల ఆలస్యం విమానాశ్రయంలోనే చిక్కుకుపోయేలా చేసింది. ఇది ఒక చెత్త విమాన అనుభవం. బాధ్యతలేని ఈ విమానసంస్థను ఎంచుకోమని ఎవరికీ చెప్పను’ అని ఆయన రాసుకొచ్చారు.
ఓటమితో నిరాశ
దక్షిణాఫ్రికా తో ఇండియా రెండు టెస్టుల సిరీస్ పూర్తయిపోయింది. ఈ టెస్ట్ లో టీమిండియా ఓడిపోయింది. దీంతో మన క్రికెటర్లంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందరూ తమ ఇంటికి ప్రయాణమయ్యారు. సిరాజ్ కూడా అలాగే హైదరాబాద్ కు రావాల్సి ఉంది. కానీ ఆయన రాత్రి వరకు విమానాశ్రయంలోనే ఇరుక్కుపోవడంతో చాలా అసహనానికి గురయ్యారు. అసలే టెస్ట్ సిరీస్ ఓడిపోయి టీమ్ ఇండియా తమ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. దీని తర్వాత గౌతమ్ గంభీర్ ను తొలగించాలన్న డిమాండ్ కూడా అభిమానులు అధికంగానే చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న సిరాజ్ కు ఇలా విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడం మరింత విసుగును తెప్పించింది.

