IPL 2026 నుంచి అవుట్.. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై ప్రీతీ జింటా ఏమన్నారంటే?
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ గాయంపై తాజా అప్‌డేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ (PBKS) యజమాని ప్రీతీ జింటా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

శ్రేయస్ అయ్యర్ గాయం ఇప్పుడు ఎలా ఉంది?
భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒక ప్రాణాపాయ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం డైవ్ చేసిన సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని రిబ్ కు తీవ్రంగా గాయం అయింది.
అలాగే, గ్రౌండ్ పై పడిపోయిన సమయంలో స్ప్లీన్ చీలిపోవడంతో అంతర్గత రక్తస్రావంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వెంటనే అయ్యర్ ను సిడ్నీ హాస్పిటల్‌కు తరలించి, అక్కడ ఒక వారం పాటు ఐసీయూలో చికిత్స అందించారు.
చికిత్స అనంతరం చిన్న ప్రొసీజర్ చేసిన వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆయన తిరిగి భారత్ చేరుకుని, ఇటీవల UGC పరీక్ష చేయించుకున్నారు. రెండు నెలల తర్వాత ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వైద్య బృందం సూచించింది. ఈ పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా ఉంటేనే ఆయన మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టడానికి అనుమతి లభిస్తుంది.
పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. అయ్యర్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌తో పాటు జనవరిలో జరిగే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌నూ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాక, భారత్‌లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీలో కూడా ఆయన అందుబాటులో ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ 2026లో అయ్యర్ ఆడతారా?
ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్ పాల్గొనడంపై కూడా పెద్ద ప్రశ్నలు వస్తున్నాయి. ఐపీఎల్ సాధారణంగా మార్చిలో ప్రారంభమవుతుంది. అయ్యర్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌కు మరికొంత సమయం అవసరమని నివేదికలు పేర్కొన్నాయి. రెండో యూసీజీ నివేదికలు పాజిటివ్‌గా రాకపోతే, ఆయన బీసీసీఐ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రిహాబ్, శిక్షణ ప్రారంభించలేరు.
ఇది పంజాబ్ కింగ్స్ (PBKS)కి పెద్ద దెబ్బగానే కనిపిస్తోంది. గత సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు నడిపిన కీలక బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ ను టాప్‌లో నిలవడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో పీబీకేఎస్ ఓడిపోయింది.
అయ్యర్ రికవరీ బాగుంది : ప్రీతీ జింటా
పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా ఇటీవల శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్‌లతో కలిసి ఒక ఈవెంట్‌కు హాజరయ్యారు. సోషల్ మీడియా వేదిక Xలో ఆమె కొన్ని ఫోటోలు పంచుకుంటూ, అయ్యర్ ఆరోగ్యం మెరుగవుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఆమె తన పోస్ట్‌లో.. "కొన్నిసార్లు ముందే ప్లాన్ చేసుకోని, అనుకోకుండా వచ్చే సాయంత్రాలు (ఈవెనింగ్స్) భలే ఉంటాయి. శశాంక్‌కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది, అలాగే శ్రేయాస్ బాగా కోలుకొని బయటికి రావడం చూసి కూడా చాలా ఆనందించాను. రోహిణి, నువ్వు ఎప్పుడూ అద్భుతంగా ఉంటావు, థాంక్యూ. డైనోను ఎప్పటిలాగే అనుకోకుండా కలవడం చాలా బాగా అనిపించింది." అని పేర్కొన్నారు.
ప్రీతీ జింటా ఈ వ్యాఖ్యలు పీబీకేఎస్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించినా, ఆయన ఐపీఎల్ 2026లో పూర్తి ఫిట్‌నెస్‌తో రంగంలోకి దిగుతారో లేదో ఇప్పటికీ స్పష్టత లేదు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడటం కష్టమే?
నవంబర్ 30 నుండి ప్రారంభమయ్యే మూడు వన్డేల దక్షిణాఫ్రికా సిరీస్‌లో అయ్యర్ పాల్గొనడంపై కూడా సందేహాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 14 నుండి టెస్ట్‌లు పూర్తయ్యాక, రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నం వేదికగా వన్డేలు జరుగనున్నాయి.
వైద్య నివేదికల ప్రకారం, అయ్యర్ పూర్తిగా ఫిట్ కావడానికి కనీసం మరో నెలపాటు సమయం అవసరం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నిర్ణయించింది.
బీసీసీఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గాయం జరిగిన సమయంలో అయ్యర్ ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోయింది. సుమారు పది నిమిషాల పాటు ఆయన నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా బ్లాక్‌అవుట్ అవడంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు.

