చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. శుభ్‌మన్ గిల్‌కు షాక్ !
Rohit Sharma : టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ప్లేస్‌నే మార్చేస్తూ బ్యాటర్‌గా మరో ఘనత సాధించాడు.

ఐసీసీ వన్డే నెంబర్ 1 బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా ప్రపంచ నెం.1 స్థానాన్ని అందుకున్నారు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, 38 సంవత్సరాల 182 రోజుల వయసులో హిట్ మ్యాన్ ఈ రికార్డును సాధించాడు. దీంతో ఇప్పటివరకు అత్యంత వయసులో నెం.1గా నిలిచిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు.
శుభ్ మన్ గిల్‌ను వెనక్కు నెట్టుతూ రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని అందుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన ఐదవ భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన రోహిత్ శర్మ
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తొలి వన్డేలో నిరాశపర్చినా అడిలైడ్ ఓవల్ లో జరిగిన రెండో వన్డేలో 73 పరుగులు, సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 121* పరుగుల సెంచరీ నాక్ ఆడాడు.
మూడుమ్యాచ్‌లలో మొత్తం 202 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 101. ఈ ప్రదర్శనతో రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. సిడ్నీ మ్యాచ్‌లో భారత్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 13 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి 33వ వన్డే సెంచరీని నమోదు చేశారు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇతర భారత బ్యాటర్లు
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు.
• విరాట్ కోహ్లీ – 6వ స్థానం (725 పాయింట్లు)
ఆసీస్ వన్డే సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లలో డక్; చివరి మ్యాచ్‌లో 74* పరుగులతో పుంజుకున్నాడు.
• శుభ్‌మన్ గిల్ – 3వ స్థానం (745 పాయింట్లు)
సిరీస్‌లో 10, 9, 24 పరుగులు మాత్రమే చేశాడు.
• శ్రేయస్ అయ్యర్ – 9వ స్థానం
అడిలైడ్‌లో హాఫ్‌సెంచరీతో ముందుకు సాగాడు.
రోహిత్ ప్రదర్శనతో రేటింగ్ పాయింట్లు 745 నుంచి 781కి పెరిగి కెరీర్ బెస్ట్ సాధించారు. అఫ్గానిస్తాన్ స్టార్ ఇబ్రాహీం జద్రాన్ (764 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ పేరిట అరుదైన రికార్డులు
ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ రోహిత్‌కు అనేక చారిత్రాత్మక మైలురాళ్లను అందించింది.
• అత్యధిక వయస్సులో (38y 182d) ఐసీసీ వన్డే నెం.1 బ్యాటర్
• 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ అద్భుత ఫామ్
• వన్డేల్లో 50 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి
• భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగుల రికార్డు
భవిష్యత్ ప్రశ్నల మధ్య బ్యాట్ తో బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన రోహిత్ శర్మ
భారత వన్డే కెప్టెన్సీ శుభ్ మన్ గిల్‌కు అప్పగించడంతో, రోహిత్ వన్డే కెరీర్ ముగింపుపై చర్చలు చెలరేగాయి. కానీ ఆయన శక్తివంతమైన పునరాగమనం ఆ సందేహాలన్నింటినీ చిత్తు చేసింది. ఈ సిరీస్ తర్వాత.. “ఇక్కడ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకం. 2008 జ్ఞాపకాలు మధురం. మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తామో లేదో తెలియదు” అని రోహిత్ శర్మ అన్నాడు.