ఒక్కడి కోసం.. ఆ ఇద్దరిని టెస్టుల నుంచి తప్పించారా..? ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న
Robin Uthappa: సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా బలవంతం చేశారా అనే సందేహం ఉందని ఊతప్ప పేర్కొన్నాడు.

అది మిలియన్ డాలర్ల ప్రశ్న..
భారత క్రికెట్ అభిమానులను ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ క్రికెట్ వీడ్కోలు. సుదీర్ఘ ఫార్మాట్‌కు సీనియర్ ఆటగాళ్లు అకస్మాత్తుగా వీడ్కోలు పలకడంపై ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశంలో యువ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న తరుణంలో, రోహిత్, కోహ్లీలు తమ టెస్ట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ, రోహిత్ టెస్ట్ వీడ్కోలుపై సందేహాలు..
ఊతప్ప ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ టెస్ట్ వీడ్కోలుపై తనకు సందేహాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. మంగళవారం తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ, వీరి టెస్ట్ రిటైర్మెంట్ తనకు సహజంగా అనిపించడం లేదని అతడు పేర్కొన్నాడు. 'ఎవరైనా వారిని వీడ్కోలు చెప్పాలని బలవంతం చేశారా అనేది తెలియదు, కానీ ఏదో ఒక రోజు నిజం బయటకు రాకపోదు,' అని ఊతప్ప వ్యాఖ్యానించాడు. కోహ్లీ, రోహిత్ స్వయంగా తాము టెస్టులకు ఎందుకు హఠాత్తుగా వీడ్కోలు పలికారో చెబుతారని తాను భావిస్తున్నానన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు..
ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా, ఆ తర్వాత వారం రోజుల్లోనే విరాట్ కోహ్లీ కూడా టెస్టుల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించాడు. మరో రెండేళ్ల పాటు ఆటగాళ్లుగా సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరూ ఒకరి వెంట ఒకరు టెస్టులకు వీడ్కోలు పలకడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ అకస్మాత్తు నిర్ణయం గురించి అనేక చర్చలు జరిగాయి. రాబిన్ ఊతప్ప కూడా వీరిద్దరి వీడ్కోలును ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ పరుగులు చేయడంలో విఫలమైన విషయాన్ని ఊతప్ప గుర్తు చేశాడు. ఆ పర్యటన తర్వాత రోహిత్ ఓ ఆరు నెలలు బ్రేక్ తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతాడని తాను భావించినట్లు అతడు తెలిపాడు. 'హిట్‌మ్యాన్ మళ్లీ పరుగులు చేస్తాడనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు,' అని ఊతప్ప అన్నాడు. అలాంటిది వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఏమిటని, ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు అర్థం కాలేదని రాబిన్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు..
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 నుంచి 2027 సీజన్ కోసం కొత్త సారథిని నియమించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధమవుతున్నారని, ఫామ్ లేని రోహిత్‌ను వీడ్కోలుకు పురికొల్పి ఉంటుందని ఒక ప్రచారం జరిగింది. టెస్టులను ప్రాణంగా ప్రేమించే విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్ అయ్యాడు అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. మరోసారి కెప్టెన్సీ ఆశించిన విరాట్‌కు సెలెక్టర్లు కుదరదని చెప్పారని, అందుకే అతడు టెస్టులకు వీడ్కోలు చెప్పాడని కూడా కొన్ని వార్తలు వచ్చాయి.
వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగింపు..
అయితే, ఈ ఇద్దరూ నిశ్శబ్దంగా వైదొలగడానికి అసలు కారణం ఏమిటో తెలిసే రోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లీలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆసీస్ పర్యటనలో వన్డేల్లో రోహిత్ మెరిస్తే, ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ చెలరేగాడు. అంతేకాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కూడా రోహిత్, కోహ్లీలు అదరగొట్టారు. వన్డేల్లో ఇంత బాగా ఆడుతున్న ఈ ఇద్దరూ టెస్టులకు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పటికీ అనుమానంగానే మారింది.

