ఆర్సీబీకి కొత్త కోచ్.. ఎవరీ మాలోలన్ రంగరాజన్?
RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు ఆర్సీబీ మహిళా జట్టుకు మాలోలన్ రంగరాజన్ కొత్త హెడ్ కోచ్‌గా వచ్చారు. లూక్ విలియమ్స్ స్థానంలో రంగరాజన్ బాధ్యతలు స్వీకరించారు.

ఆర్‌సీబీ జట్టులో పెద్ద మార్పులు
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ పెద్ద మార్పు చేసింది. జట్టు కొత్త హెడ్ కోచ్‌గా మాలోలన్ రంగరాజన్‌ను నియమించింది. ఆయన లూక్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. విలియమ్స్ నాయకత్వంలో ఆర్‌సీబీ మహిళా జట్టు 2024లో తొలిసారిగా డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.
రంగరాజన్ గత రెండు సీజన్లలో ఆర్‌సీబీ మహిళా జట్టులో అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 2026 సీజన్‌కు సన్నద్ధం అవుతున్నారు. ఈ సీజన్ కోసం ఆర్‌సీబీ మంధాన, ఎలిస్ పెర్రీ, రిఛా ఘోష్, శ్రేయంకా పాటిల్‌లను రిటైన్ చేసింది.
దేశవాళీ ప్లేయర్ నుంచి కోచింగ్ వరకు ప్రయాణం: మాలోలన్ రంగరాజన్ ఎవరు?
మాలోలన్ రంగరాజన్ దేశవాళీ క్రికెట్ లో తమిళనాడు, ఉత్తరాఖండ్ తరఫున ఆడారు. మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ అయిన రంగరాజన్.. 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 136 వికెట్లు పడగొట్టాడు. 28.14 సగటుతో 1,379 పరుగులు చేశారు. ఆయనకు కోచింగ్ రంగంలో విస్తృత అనుభవం ఉంది. ఆర్‌సీబీ పురుషుల జట్టులో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
సంజయ్ బంగర్, మైక్ హెసన్, సైమన్ క్యాటిచ్, ఆండీ ఫ్లవర్, దినేష్ కార్తిక్ వంటి ప్రముఖులతో కలిసి రంగరాజన్ పనిచేశారు. ఆయన ఆర్‌సీబీ సంస్థలో అనుభవం కలిగిన వ్యక్తి కావడం ఫ్రాంచైజీకి కీలక ఆస్తిగా భావిస్తున్నారు.
ఆర్సీబీ కొత్త కోచ్ ఏమన్నారంటే?
మాలోలన్ రంగరాజన్ తన నియామకంపై ఆనందం వ్యక్తం చేశారు. “ఆర్‌సీబీ మహిళా జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు గౌరవంగా ఉంది. 2024లో లూక్ విలియమ్స్ చేసిన కృషిని నేను గుర్తుచేసుకుంటున్నాను. ఆర్‌సీబీ విజయంలో ఆయన పాత్ర అమోఘం” అని ఆయన అన్నారు.
“గత మూడు సంవత్సరాల్లో నేను స్మృతి మంధాన, కోచింగ్ టీమ్, సపోర్ట్ స్టాఫ్‌తో మంచి సంబంధం ఏర్పరుచుకున్నాను. ఆ భాగస్వామ్యాన్ని కొనసాగించి ఆర్‌సీబీ అభిమానులకు విజయాన్ని అందించేందుకు ఎదురుచూస్తున్నాను” అని రంగరాజన్ తెలిపారు.
స్మృతి మంధాన ఏమన్నారంటే?
జట్టు కెప్టెన్ స్మృతి మంధాన రంగరాజన్ నియామకంపై సంతోషం వ్యక్తం చేశారు. “మాలోలన్ రంగరాజన్ హెడ్ కోచ్‌గా రావడం సంతోషంగా ఉంది. ఆయనతో మాకు మంచి అనుబంధం ఉంది. గత మూడు సంవత్సరాలుగా ఆయన జట్టుపై సానుకూల ప్రభావం చూపారు. రాబోయే సీజన్‌లో కూడా ఆయనతో కలిసి ఆర్‌సీబీకి విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది” అని మంధాన అన్నారు.
ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా అన్యా శ్రబ్‌సోల్
ఆర్‌సీబీ కోచింగ్ సెట్‌ప్‌లో మరో పెద్ద మార్పు కూడా చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ అన్యా శ్రబ్‌సోల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించారు.
శ్రబ్‌సోల్ ఇంగ్లాండ్ తరఫున 227 వికెట్లు తీశారు. 2017 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టుపై 6/46 అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌కు టైటిల్ సాధించిపెట్టారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆమె ఇప్పుడు కోచింగ్ రంగంలో అడుగుపెట్టారు.
కొత్త దిశలో ఆర్‌సీబీ ప్రయాణం
డబ్ల్యూపీఎల్ 2025 మెగా వేలం ముందు ఆర్‌సీబీ చాలా మంది కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. జార్జియా వెర్‌హామ్, రేణుకా సింగ్, కిమ్ గార్త్, కేట్ క్రాస్, సోఫీ మోలినెక్స్, ఆశా సోభానా వంటి ఆటగాళ్లు జట్టులో లేరు. కొత్త కోచ్ మాలోలన్ రంగరాజన్ నేతృత్వంలో ఆర్‌సీబీ మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
2024లో మొదటి టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ, ఇప్పుడు రెండో టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. కొత్త కోచింగ్ బృందం, కొత్త వ్యూహాలు.. ఇవన్నీ జట్టుకు నూతన శక్తి నింపేలా ఉన్నాయి.