- Home
- Sports
- Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
Pondicherry Cricketers Assault : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఎంపిక చేయలేదని పుదుచ్చేరి అండర్-19 కోచ్‌పై ముగ్గురు క్రికెటర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్ తలకు 20 కుట్లు పడ్డాయి.

సెలక్షన్ లిస్ట్‌లో పేరు లేదని కోచ్‌పై బ్యాట్‌తో దాడి
క్రికెట్‌ను అందరూ 'జెంటిల్మెన్ గేమ్' అని పిలుస్తారు. కానీ, అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఈ క్రీడ ప్రతిష్ఠను మసకబారుస్తుంటాయి. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జట్టులో చోటు దక్కలేదన్న కోపంతో ఏకంగా కోచ్‌పైనే ఆటగాళ్లు దాడికి దిగడం సంచలనం సృష్టించింది.
పుదుచ్చేరి అండర్-19 క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌పై ముగ్గురు స్థానిక క్రికెటర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. తలకు 20 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆయన భుజానికి కూడా బలమైన గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎంపికే కారణం?
పోలీసుల వివరాల ప్రకారం.. పుదుచ్చేరి అండర్-19 జట్టు ప్రధాన కోచ్‌గా ఎస్. వెంకటరమణ వ్యవహరిస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో క్యాప్ (CAP) కాంప్లెక్స్‌లోని ఇండోర్ నెట్స్‌లో కోచ్ వెంకటరమణ ఉండగా, ముగ్గురు క్రికెటర్లు అక్కడికి వచ్చారు. సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీకి తమను ఎంపిక చేయకపోవడంపై వారు కోచ్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఆటగాళ్లు కోచ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కోచ్ వెంకటరమణ తల, నుదురు, భుజం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని సీనియర్ క్రికెటర్ కార్తికేయన్ జయసుందరమ్, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఎ.అరవిందరాజ్, ఎస్.సంతోష్ కుమారన్‌గా గుర్తించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సెదార్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నట్టు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్. రాజేష్ తెలిపారు.
హత్యాయత్నం చేశారంటూ ఫిర్యాదు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోచ్ వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు. తనపై దాడి వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. "అరవిందరాజ్ నన్ను గట్టిగా పట్టుకోగా.. సంతోష్ చేతిలో ఉన్న బ్యాట్‌ను తీసుకుని కార్తికేయన్ నాపై దాడి చేశాడు. నన్ను చంపాలనే ఉద్దేశంతోనే వారు కొట్టారు. నన్ను చంపితేనే జట్టులో అవకాశం వస్తుందని చంద్రన్ తమకు చెప్పాడని దాడి చేస్తున్న సమయంలో వారు అన్నారు" అని వెంకటరమణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
భారతీదాసన్ పుదుచ్చేరి క్రికెటర్స్ ఫోరమ్ కార్యదర్శి జి. చంద్రన్ ఈ దాడికి వారిని ప్రేరేపించారని వెంకటరమణ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఫోరమ్ అధ్యక్షుడు సెంథిల్ కుమారన్ ఖండించారు. వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయని, ఆయన స్థానిక క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తారని సెంథిల్ పేర్కొన్నారు. చంద్రన్‌పై వ్యక్తిగత కక్షతోనే వెంకటరమణ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
వెలుగులోకి వస్తున్న అక్రమాలు
పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్‌లో స్థానికేతరులకు అక్రమంగా అవకాశాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. నకిలీ పత్రాలతో ఇతర రాష్ట్రాల ఆటగాళ్లను స్థానికులుగా చూపిస్తున్నారని, దీనివల్ల పుదుచ్చేరిలో పుట్టిన ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని ఇటీవల ఒక జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. 2021 నుంచి రంజీ ట్రోఫీలో కేవలం ఐదుగురు స్థానిక పుదుచ్చేరి ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కిందని ఆ రిపోర్టు పేర్కొంది.
ఈ పరిణామాలపై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పందించారు. ఈ ఆరోపణలు తీవ్రమైనవని, బోర్డు వీటిని నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. మరోవైపు, కోచ్‌పై దాడి ఘటనపై మాట్లాడేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పుదుచ్చేరి (CAP) నిరాకరించింది. అయితే, అవినీతి పట్ల తమకు 'జీరో టాలరెన్స్' ఉందని, బీసీసీఐ నిబంధనల ప్రకారమే ఎంపికలు జరుగుతున్నాయని సీఈవో రాజు మెహతా స్పష్టం చేశారు.

