- Home
- Sports
- Most Sixes in ODI : 6 6 6 6 6 6 6 అమ్మ బాబోయ్.. ఇన్ని సిక్సర్లా? పూనకాలు తెప్పించే మ్యాచ్ !
Most Sixes in ODI : 6 6 6 6 6 6 6 అమ్మ బాబోయ్.. ఇన్ని సిక్సర్లా? పూనకాలు తెప్పించే మ్యాచ్ !
Most Sixes in ODI : వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాటర్లు 46 సిక్సర్లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. 807 పరుగులు నమోదైన ఈ చారిత్రక మ్యాచ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గేల్, బట్లర్ విధ్వంసం.. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం.
క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు కేవలం ఫలితాల వల్ల కాకుండా, అందులో నమోదైన అద్భుతమైన గణాంకాల వల్ల ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాధారణంగా వన్డే క్రికెట్‌లో బౌలర్లు, బ్యాటర్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుంది. కానీ ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో మాత్రం ఏకంగా సిక్సర్ల తుపాను వచ్చింది. ఆ మ్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా బ్యాటర్లు చెలరేగిపోయారు.
బౌలర్లు వేసిన బంతులను స్టేడియం బయటకు పంపిస్తూ బ్యాటర్లు చేసిన విధ్వంసానికి, బౌలర్లు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 46 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ కారణంగా ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 46 సిక్సర్లు నమోదైన ఏకైక మ్యాచ్‌గా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది.
చరిత్రలో నిలిచిపోయిన ఇంగ్లండ్-వెస్టిండీస్ పోరు
వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య 2019, ఫిబ్రవరి 27న సెయింట్ జార్జ్ లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈ రికార్డుకు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పోటీపడి మరీ సిక్సర్లు బాదారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో మొత్తం 46 సిక్సర్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వన్డే చరిత్రలో ఏ ఇతర మ్యాచ్‌లోనూ ఇన్ని సిక్సర్లు నమోదు కాలేదు.
ఇదే కాకుండా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలిపి ఏకంగా 807 పరుగులు సాధించాయి. ఇందులో 64 ఫోర్లు, 46 సిక్సర్లు ఉండటం గమనార్హం. కేవలం బౌండరీల రూపంలోనే భారీగా పరుగులు వచ్చాయంటే బ్యాటర్లు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
టాస్ గెలిచిన విండీస్.. ఇంగ్లండ్ భారీ స్కోరు
2019 ఫిబ్రవరి 27న జరిగిన ఈ చారిత్రక మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి స్కోరు బోర్డుపై 418 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ముఖ్యంగా జోస్ బట్లర్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 77 బంతుల్లోనే బట్లర్ 150 పరుగులు సాధించాడు. 194.80 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన బట్లర్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు బాదాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ఇయాన్ మోర్గాన్
జోస్ బట్లర్‌తో పాటు ఇంగ్లండ్ అప్పటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా అద్భుతమైన సెంచరీ సాధించాడు. మోర్గాన్ 88 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 117.04 స్ట్రైక్ రేట్‌తో ఆడిన మోర్గాన్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరి విధ్వంసంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 34 ఫోర్లు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ ముందు 50 ఓవర్లలో 419 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని భావించినా, వెస్టిండీస్ బ్యాటర్లు మాత్రం చివరి వరకు పోరాడారు.
ధీటుగా బదులిచ్చిన వెస్టిండీస్ బ్యాటర్లు.. గేల్ దెబ్బ
419 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఏమాత్రం భయపడకుండా ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. వెస్టిండీస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 48 ఓవర్లలో 389 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓడిపోయినప్పటికీ విండీస్ బ్యాటర్లు చూపించిన పోరాట పటిమ అద్భుతం.
ముఖ్యంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గేల్ 97 బంతుల్లోనే 162 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 167.01 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన గేల్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఏకంగా 14 సిక్సర్లు బాదాడు.
గేల్, బట్లర్ దెబ్బకు బద్దలైన రికార్డులు
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 30 ఫోర్లు, 22 సిక్సర్లు నమోదయ్యాయి. ఇరు జట్ల స్కోర్లు కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 807 పరుగులు వచ్చాయి. బౌండరీల పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో మొత్తం 64 ఫోర్లు, 46 సిక్సర్లు నమోదయ్యాయి.
ఒక వన్డే మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు నమోదు కావడం ఇదే తొలిసారి, ఇప్పటికీ ఇదే ప్రపంచ రికార్డుగా కొనసాగుతోంది. బౌలర్లను కేవలం ప్రేక్షకులుగా మార్చిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. గేల్, బట్లర్ లు దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడారు.

