భారత ఖోఖో జట్టు కెప్టెన్‌గా తెలుగు యోధాస్ స్టార్.. ఎవరీ ప్రతీక్ వైకర్?
Kho Kho World Cup 2025: జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న తొలి ఖోఖో ప్రపంచకప్ 2025 లో భారత పురుషుల జట్టుకు ప్రతీక్ వైకర్ నాయకత్వం వహించనున్నారు.
Pratik Waikar
Kho Kho World Cup 2025: జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖోఖో వరల్డ్ కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ మొదటి ఎడిషన్ లో 20 పురుషుల జట్లు, 19 మహిళా జట్లు పాల్గొంటాయి. టోర్నమెంట్ కోసం మొత్తం 23 దేశాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించింది.
ఖో ఖో భారత పురుషుల జట్టును ప్రతీక్ వైకర్ (కెప్టెన్) ముందుకు నడిపించనున్నాడు. అతనితో పాటు జట్టులో ప్రబాని సబర్, మెహుల్, సచిన్ భార్గో, సుయాష్ గార్గేట్, రామ్‌జీ కశ్యప్, శివ పోతిర్ రెడ్డి, ఆదిత్య గన్‌పూలే, గౌతమ్ ఎంకే, నిఖిల్ బి, ఆకాష్ కుమార్, సుబ్రమణి వి, సుమన్ బర్మన్, అనికేత్ పోటే, ఎస్. రోకేసన్ సింగ్ ఉన్నారు. స్టాండ్‌బై లో అక్షయ్ బంగారే, రాజవర్ధన్ శంకర్ పాటిల్, విశ్వనాథ్ జానకిరామ్ లు ఉన్నారు.
Kho Kho telugu
ఖో ఖో తొలి వరల్డ్ టైటిల్ పై కన్నేసిన భారత్
తొలి ఖో ఖో ప్రపంచ కప్ ఈవెంట్‌లో మొత్తం 39 దేశాలు పాల్గొంటున్నాయి. ప్రతీక్ వైకర్ కెప్టెన్‌గా భారత పురుషుల జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతని సంవత్సరాల అనుభవం, నాయకత్వ నైపుణ్యాలను ఉపయోగించుకుని తొలి టైటిల్ ను సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 24 ఏళ్లుగా ఖో ఖో ఆటను ఆడుతున్న 32 ఏళ్ల అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఖో ఖో ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడంతో తన కల నెరవేరిందని చెప్పాడు.
ప్రతిక్ వైకర్ భారత ఖో ఖోలో ప్రసిద్ధి చెందిన ప్లేయర్లలో ఒకరు. అనేక అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. రాబోయే ఖో ఖో ప్రపంచ కప్ 2025లో జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా అతని కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకోనున్నాడు.
భారత ఖోఖో జట్టు కెప్టెన్.. ఎవరీ ప్రతిక్ వైకర్?
భారత ఖోఖో క్రీడలో మంచి గుర్తింపు పొందిన ప్లేయర్ ప్రతీక్ వైకర్. అతను 8 సంవత్సరాల వయస్సులోనే ఖో ఖోపై ఆసక్తిని కనబరచడం ప్రారంభించాడు. క్రీడలలో అతని కుటుంబ నేపథ్యం ఉండటం అతని నైపుణ్యాలు మరింత పెరగడంలో దోహదపడింది. మహారాష్ట్రలో జన్మించిన ప్రతీక్ వైకర్ ఖో ఖో ఆటలోకి రాకముందు మరొక స్థానిక క్రీడ అయిన లాంగ్డిని ఆడేవాడు.
అతను తన పొరుగువారిలో ఒకరు క్రీడను ఆడటం చూసిన తర్వాత ఖో ఖోపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత వెనక్కి చూసుకోకుండా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇప్పుడు ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో భారత జట్టును ముందుకు నడిపించనున్నాడు. అతని సారథ్యంలో భారత్ కప్ గెలుచుకోవాలని చూస్తోంది.
Chennai Kho Kho
ఖోఖో అండర్-18 విభాగంలో అద్భుత ప్రదర్శనతో మెరిసిన ప్రతీక్ వైకర్
భారతదేశం కోసం U-18 విభాగంలో తన అద్భుతమైన ప్రదర్శనను అందించిన ప్రతీక్ వైకర్ మహారాష్ట్రలో మంచి గుర్తింపు పొందాడు. ఖోఖో లో అద్భుత ప్రదర్శనలు ఇస్తూ మంచి గుర్తింపు పొందిన తర్వాత అతనికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.
ఇది అతనికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది. అతని కుటుంబ పరిస్థితులను మెరుగుపరిచింది. 2016లో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తొలిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో మహారాష్ట్ర ఆటగాడి కల నెరవేరింది. అప్పటి నుండి అతను తొమ్మిది మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు భారత ఖోఖో జట్టు కెప్టెన్ గా మెగా టోర్నీలో ఆడనున్నాడు.
Image credit: Ultimate Kho Kho
అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ తరపున ఆడుతున్న ప్రతీక్ వైకర్
భారత కెప్టెన్ ప్రతీక్ అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ తరపున ఆడతాడు. అతను 2022లో టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు నడిపించాడు. అయితే ఒడిశా జగ్గర్‌నాట్స్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాతి సీజన్‌లో సెమీఫైనల్‌లో ఒడిశా జట్టు చేతిలో ఓడిన తెలుగు యోధాలు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. గత రెండు సీజన్లలో, ప్రతీక్ వైకర్ తన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. దీని ఫలితంగానే రాబోయే ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత కెప్టెన్సీని దక్కించుకున్నాడు.
వైకర్ తన ఖో ఖో కెరీర్‌తో పాటు చదువులో కూడా మంచి విజయాలు అందుకున్నాడు. అతను ఫైనాన్స్‌లో మాస్టర్స్ పొందే ముందు కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. గత సంవత్సరం ప్రతీక్ వైకర్ 56వ జాతీయ ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో మహారాష్ట్రకు టైటిల్‌ను అందించాడు.