ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్
World Archery Championships: భారత పురుషుల కంపౌండ్ ఆర్చరీ జట్టు దక్షిణ కొరియా గ్వాంగ్జులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించింది. తొలిసారి గోల్డ్ మెడల్ సాధించింది.

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్: భారత జట్టు చారిత్రాత్మక విజయం
దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు వేదికగా జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల కంపౌండ్ జట్టు ఆదివారం చరిత్ర సృష్టించింది. ఫ్రాన్స్‌పై 235-233 తేడాతో విజయం సాధించి, భారత్ తన తొలి పురుషుల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది.
From 🇦🇺 to 🇺🇸 to 🇹🇷 & finally 🇫🇷—Rishabh Yadav, Prathamesh Fuge & Aman Saini showed nerves of steel to clinch 🥇 India’s first-ever Compound Men’s Team Gold at #WorldArcheryChampionships 2025, Gwangju! 🏹🇮🇳🔥#ArcheryIndia#TeamIndia#NTPCpic.twitter.com/JIvP2cY16f
— ARCHERY ASSOCIATION OF INDIA (@india_archery) September 7, 2025
ఉత్కంఠగా సాగిన పోరాటం
రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేష్ భలచంద్ర ఫుగేలతో కూడిన భారత జట్టు ప్రారంభంలో 57-59తో నిలిచింది. కానీ రెండో ఎండ్‌లో వరుసగా ఆరు పర్ఫెక్ట్ 10లు సాధించి స్కోరు 117-117తో సమం చేసింది. మూడు రౌండ్ల తర్వాత 176-176 స్కోరు వద్ద నిలిచిన పోరులో చివర్లో ఫ్రాన్స్ తప్పిదాలు చేయగా, చివరి బాణాన్ని ఫుగే 10గా నమోదు చేసి భారత్‌కు చారిత్రక స్వర్ణాన్ని అందించాడు.
వ్యూహాత్మక మార్పులతో విజయం
భారత చీఫ్ కంపౌండ్ కోచ్ జీవన్జోత్ సింగ్ తేజా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆటగాళ్ల క్రమాన్ని మార్చడం కీలకంగా మారింది. రిషభ్ యాదవ్ మొదట, అమన్ సైనీ రెండవ స్థానంలో, ఫుగే చివరగా బాణం వదలడం ద్వారా జట్టు సమతుల్యత సాధించింది. ఈ వ్యూహంతో భారత్ అమెరికా, టర్కీని ఓడించి ఫైనల్‌కు చేరుకుందని తెలిపారు.
రిషభ్ యాదవ్ అదరగొట్టేశాడు
23 ఏళ్ల రిషభ్ యాదవ్ ఈ పోటీలో అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకుముందు, జ్యోతి శూరేక విన్నం జతగా మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో నెదర్లాండ్స్ మ్యాచ్ లో 155-157 నిలిచి రజత పతకం సాధించాడు. తరువాత పురుషుల జట్టుతో స్వర్ణం సాధించడం ద్వారా ఒక్క ఛాంపియన్‌షిప్‌లోనే రెండు పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది షాంఘై వరల్డ్ కప్‌లో మొదటి పతకం గెలిచిన రిషభ్, ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలతో తన ప్రతిభను నిరూపించాడు.
మహిళల జట్టుకు నిరాశ
భారత మహిళల కంపౌండ్ జట్టు ప్రీక్వార్టర్‌ఫైనల్లో ఇటలీతో 229-233 తేడాతో ఓడిపోయింది. 2017 నుండి వరుసగా నాలుగు సార్లు పతకాలను సాధించిన మహిళల జట్టు ఈసారి బరిలోనుంచి ఖాళీ చేతులతో నిష్క్రమించింది. ఈసారి భారత్ గ్వాంగ్జులో ఒక స్వర్ణం, ఒక రజతాన్ని సాధించింది. ఇది దేశం కంపౌండ్ ఆర్చరీలో పెరుగుతున్న శక్తిని ప్రపంచానికి చూపించింది. రాబోయే పోటీలలో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తుందనే నమ్మకం పెరిగింది.