ఒకసారి వన్డే.. మరోసారి టీ20.. ఇలా ఆసియా కప్ ఫార్మాట్ ఎందుకు మారుతుంటుంది?
Why Asia Cup Format Keeps Changing: 1984లో ప్రారంభమైన ఆసియా కప్ ఫార్మాట్ 2016 నుంచి మారుతూ వస్తోంది. ఒకసారి వన్డే, మరోసారి టీ20గా ఎందుకు నిర్వహిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1984లో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నమెంట్
ఆసియా కప్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్‌లలో ఒకటి. పేరుతోనే తెలిసినట్లుగా ఈ పోటీలో ఆసియా దేశాల జట్లు మాత్రమే పాల్గొంటాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, యూఏఈ, హాంగ్‌కాంగ్ ఈ టోర్నమెంట్‌ను ఆడే జట్లు.
1984లో ఆసియా కప్ తొలిసారి జరిగింది. ఈ టోర్నమెంట్ ను ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహిస్తుంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టోర్నమెంట్ జరగాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో టెస్ట్, వన్డే ఫార్మాట్‌లే ఉండటంతో ఆసియా కప్ ను వన్డే రూపంలోనే ఆడారు.
KNOW
ఆసియా కప్ 2016లో భారీ మార్పులు
2016లో ఆసియా కప్ ఫార్మాట్‌లో కీలకమైన మార్పు వచ్చింది. తొలిసారి ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అప్పటి వరకు కేవలం 50 ఓవర్ల వన్డే రూపంలోనే సాగిన ఆసియా కప్ టీ20 ఫార్మాట్ కు మారింది. ఆ తర్వాత ఈ పోటీ, ఆ ఏడాది నుంచి ప్రత్యామ్నాయంగా ఒకసారి వన్డే, మరోసారి టీ20 ఫార్మాట్‌లో జరగడం ప్రారంభమైంది.
ఐసీసీ నిర్ణయంతో ఆసియా కప్ లో ఫార్మాట్ రొటేషన్
2015లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తన విధానాల్లో మార్పులు చేసింది. ఆ మార్పుల ప్రభావం ఆసియా కప్ పైన కూడా పడింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ పవర్ ను కొంత వరకు తగ్గించినా.. టోర్నమెంట్ నిర్వహణ మాత్రం ఏసీసీ వద్దనే కొనసాగింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆసియా కప్ ఫార్మాట్ రొటేషన్ పద్ధతిలో జరుగుతుందని తేలింది.
దాని ప్రకారం, ఆసియా కప్ తర్వాత జరిగే ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో, దాని ఫార్మాట్‌నే ఆసియా కప్‌లో అనుసరిస్తారు.
ఉదాహరణకు వన్డే వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. అలాగే, టీ20 వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ టీ20 రూపంలో జరుగుతుంది. ఈ విధంగా జట్లు వరల్డ్ కప్‌కు సిద్ధమయ్యే అవకాశం పొందుతాయి. అందుకే ఐసీసీ ఈవెంట్లకు అనుగుణంగా ఆసియా కప్ ఫార్మాట్ మారుతుంది.
ఆసియా కప్ లో వన్డే, టీ20 మార్పులు
2016లో ఆసియా కప్ తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగింది. ఎందుకంటే ఆ సంవత్సరం భారత్ ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ టోర్నీ జరిగింది. ఆ తర్వాత 2018లో ఆసియా కప్ వన్డే రూపంలో జరిగింది, ఎందుకంటే 2019లో వన్డే వరల్డ్ కప్ కూడా జరిగింది.
2022లో మళ్లీ ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. దానికి కారణం 2022 చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఉండటమే. ఈ విధంగా ఐసీసీ ప్రధాన టోర్నమెంట్‌ల ప్రకారం ఆసియా కప్ ఫార్మాట్ మారుతోంది.
2025లో మూడోసారి టీ20 ఫార్మాట్ లో ఆసియా కప్
2025లో జరగబోయే ఆసియా కప్ టీ20 రూపంలో మూడోసారి జరగనుంది. అంతకు ముందు 2016, 2022లో టీ20 ఫార్మాట్ లో ఆసియా కప్ టోర్నీలు జరిగాయి. అంటే, ఈ సారి కూడా జట్లు టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా సన్నద్ధమవుతాయి. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో ఎక్కువసార్లు జరిగినా, ఈ కొత్త రొటేషన్ విధానం కారణంగా ఆసియా కప్ రెండురకాల ఫార్మాట్లలోనూ సమాన ప్రాధాన్యం పొందుతోంది.
మొత్తంగా ఆసియా కప్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులను చూసింది. వన్డే క్రికెట్ ఆధిపత్యం నుంచి టీ20 వైపు మార్పు, ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఫార్మాట్ రొటేషన్, ప్రతి టోర్నమెంట్ తర్వాత వచ్చే వరల్డ్ కప్ కు సన్నాహకంగా ఆసియా కప్ మారింది. ఈ మార్పుల వల్లే ఆసియా జట్లకు వరల్డ్ కప్‌కి ముందు ఒక బలమైన పాక్టీస్ వేదిక లభిస్తోంది.