IND vs WI : భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే
IND vs WI : భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆడిన 100 టెస్టుల్లో ఎవరి రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పడు తెలుసుకుందాం.

భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్
భారత్, వెస్టిండీస్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గురువారం (అక్టోబర్ 2) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. తాజాగా ఆసియా కప్ 2025 ఫైనల్‌లో చారిత్రక విజయాన్ని సాధించిన భారత జట్టు.. టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు, వెస్టిండీస్ జట్టు గతంలో భారత్ కు షాకిచ్చిన విధంగా తమ ఆటను కొనసాగించాలనుకుంటోంది. ఈ సరీస్ కోసం రెండు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్: హెడ్ టు హెడ్ రికార్డు ఎలా ఉన్నాయి?
ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ మధ్య 100 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో వెస్టిండీస్ 30 టెస్టులు గెలిచింది. భారత్ మాత్రం 23 విజయాలు మాత్రమే సాధించింది. మిగతా 47 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే మొత్తంగా భారత్ పై వెస్టిండీస్ పైచేయిగా ఉంది.
1950-1980 మధ్య కాలంలో వెస్టిండీస్ క్రికెట్ అద్భుతమైన ఆటతో భారత్ పై ఈ ఆధిపత్యాన్ని సాధించింది. ఆ సమయంలో విండీస్ ను ఓడించడం అంటే ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాల్ గా ఉండేది. అయితే, గత దశాబ్దంలో భారత్ తన రికార్డును మెరుగుపరచుకుంది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్‌లో వెస్టిండీస్ పై భారత్ గణనీయమైన ఆధిపత్యాన్ని సాధిస్తోంది.
వెస్టిండీస్ సిరీస్ కోసం భారత్ జట్టు ప్లేయింగ్ 11
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జట్టులో కొత్త ప్లేయర్లకు చోటుదక్కింది. వెస్టిండీస్ తో జరిగే భారత జట్టు ప్లేయింగ్ 11 అంచనా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి..
• ఓపెనర్లు: కేఎల్ . రాహుల్, యశస్వి జైస్వాల్
• నెంబర్. 3: సాయి సుదర్శన్
• నెంబర్. 4: కెప్టెన్ శుభ్‌మన్ గిల్
• నెంబర్. 5: ధ్రువ్ జురెల్
• నెంబర్. 6: రవీంద్ర జడేజా
• ఆల్‌రౌండర్లు/బౌలర్లు: వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్
• స్పిన్: కుల్దీప్ యాదవ్
• ఫాస్ట్ బౌలర్లు: మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా
ఈ కాంబినేషన్‌తో భారత్ బలమైన జట్టుగా ఉంది.
భారత్ vs వెస్టిండీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి?
2002 తర్వాత వెస్టిండీస్ భారత్‌పై టెస్ట్ సిరీస్‌ను గెలవలేకపోయింది. ఇప్పుడు కెప్టెన్ రోస్టన్ చేస్ ఆధ్వర్యంలో యంగ్ వెస్టిండీస్ జట్టుకు ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిస్తే భారత్‌ను కష్టాల్లోకి నెట్టగల సామర్థ్యం ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
భారత్ vs వెస్టిండీస్ సిరీస్ ప్రత్యేకత ఏంటి?
ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్, వెస్టిండీస్ రెండు జట్లలో పెద్ద మార్పులు జరిగాయి. భారత్ కొత్త కెప్టెన్సీతో ఆడుతున్నందున ఆటగాళ్ల ఫామ్, జట్టు సమన్వయం కీలకమవుతుంది. మరోవైపు వెస్టిండీస్ యువజట్టు పాత రికార్డును తిరగ రాయాలనుకుంటోంది. అభిమానులకు ఇది రసవత్తరమైన పోటీగా ఉండనుంది. హెడ్ టు హెడ్ రికార్డు ప్రకారం వెస్టిండీస్ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్ ఫేవరేట్‌గా నిలుస్తోంది.