IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
India vs South Africa : ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. బౌలర్ల మ్యాజిక్, అభిషేక్ శర్మ మెరుపులతో టీమిండియా సునాయాస గెలుపును సొంతం చేసుకుంది.

IND vs SA: ధర్మశాలలో భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం
ధర్మశాలలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా, చండీగఢ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇప్పుడు ధర్మశాలలో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్ల దాటికి సౌతాఫ్రికా జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 16వ ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ డిసెంబర్ 17న లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
సౌతాఫ్రికా బ్యాటింగ్ ను దెబ్బకొట్టిన భారత బౌలర్లు
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే అర్షదీప్ సింగ్.. రీజా హెండ్రిక్స్ (0) వికెట్ పడగొట్టాడు. హెండ్రిక్స్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ (1) ఔట్ అయ్యాడు.
నాలుగో ఓవర్‌లో హర్షిత్ రాణా మరో వికెట్ తీయడంతో డెవాల్డ్ బ్రెవిస్ (2) పెవిలియన్ చేరాడు. దీంతో కేవలం 7 పరుగులకే సౌతాఫ్రికా 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది.
కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఒంటరి పోరాటం
కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడానికి కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్ ప్రయత్నించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 23 పరుగులు జోడించారు. అయితే 7వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో స్టబ్స్ (9) ఔట్ అయ్యాడు. ఈ వికెట్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
మరోవైపు కెప్టెన్ మార్క్రామ్ ఒక్కడే భారత బౌలర్లను ఎదురొడ్డి నిలిచాడు. అతను 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. 11వ ఓవర్‌లో శివమ్ దూబే కార్బిన్ బాష్ వికెట్ తీయగా, వరుణ్ చక్రవర్తి ఫెరీరా (20), జాన్సెన్‌లను పెవిలియన్ పంపాడు. చివర్లో కుల్దీప్ యాదవ్ మిగిలిన వికెట్లు పడగొట్టడంతో సౌతాఫ్రికా 117 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అందరూ రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు తలో వికెట్ దక్కింది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా సౌతాఫ్రికా బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.
అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం
118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మొదటి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతను కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అభిషేక్ దాటికి సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడిలో పడ్డారు. ఆ తర్వాత గిల్, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. గిల్ 28 బంతుల్లో 28 పరుగులు చేసి 12వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
తుది జట్టులో మార్పులు
చివర్లో తిలక్ వర్మ (25 నాటౌట్), శివమ్ దూబే (10 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్, వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఇంటికి వెళ్లడంతో.. వారి స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం కల్పించారు. బుమ్రా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్య తెలిపాడు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ఎన్రిక్ నోర్కియా, లుంగీ ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.

