IND vs AUS: సూర్య-గిల్ జోరు పై వర్షం దెబ్బ.. తొలి మ్యాచ్ రద్దు
IND vs AUS: కాన్‌బెర్రాలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ వర్షంతో రద్దు అయింది. సూర్యకుమార్ (39* పరుగులు), గిల్ (37* పరుగులు) అద్భుతంగా ఆడుతున్న సమయంలో వర్షం అడ్డుపడింది.

కాన్‌బెర్రాలో తొలి టీ20 రద్దు
భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బుధవారం కాన్‌బెర్రాలోని మానుకా ఓవల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 9.4 ఓవర్ల వరకు భారత టీమ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. అయితే, గిల్, సూర్య అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తుండగా, వర్షం అడ్డుపడింది. వరుస వర్ష అంతరాయాల కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆట నిలిచే సమయానికి భారత్ 97/1 పరుగులు చేసింది.
గిల్–అభిషేక్ నుండి మంచి ఆరంభం
ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ మొదటి వికెట్ కు 19 బంతుల్లో 35 పరుగులు చేశారు. తన తొలి ఆస్ట్రేలియా పర్యటనతో టీ20లో ఆడుతున్న అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో క్యాచ్‌గా పెవిలియన్ కు చేరాడు.
ఆసీస్ బౌలర్లను కంగారెత్తించిన సూర్యకుమార్ యాదవ్
అభిషేక్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, గిల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సూర్య 24 బంతుల్లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన తుపాను ఫామ్ ను అందుకుంటూ ఆసీస్ ను కంగారెత్తించాడు.
మరో ఎండ్ లో గిల్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి ధాటిగా ఆడాడు. ఇద్దరి మధ్య 62 పరుగుల భాగస్వామ్యం భారత్‌ను బలమైన స్థితిలోకి తీసుకెళ్లింది. ఇద్దరూ కంగారు బౌలింగ్ ను దంచికొడుతున్న సమయంలో వర్షం అడ్డుపడింది.
ఆట మధ్యలో రెండు సార్లు వర్షం అంతరాయం
మొదటి 5 ఓవర్లు పూర్తయ్యాక వర్షం తొలి సారి అంతరాయం కలిగించింది. ఆట మళ్లీ ప్రారంభించి 18 ఓవర్ల మ్యాచ్‌గా మార్చారు. కానీ 10వ ఓవర్ సమయంలో మళ్లీ వర్షం రావడంతో అంపైర్లు గ్రౌండ్ పరిస్థితిని పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేసినట్టు ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం ఆట కొనసాగితే ఆస్ట్రేలియా ఛేజ్ ప్రారంభించాల్సి ఉండేది. కానీ వర్షం మరింతగా పెరగడంతో అవకాశం లేకుండా పోయింది.
టీమ్ కాంబినేషన్: భారత జట్టులో మార్పులు
ఆసియా కప్ గెలిచిన జట్టులో భారత్ ఒకే మార్పు చేసింది. రింకూ సింగ్ స్థానంలో పేసర్ హర్షిత్ రాణా అవకాశాన్ని పొందాడు. పేస్ ఫ్రెండ్లీ కండీషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఛాంపియన్ బౌలర్ అర్షదీప్ సింగ్‌ను బెంచ్‌లో కూర్చోబెట్టడంతో గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా ప్లేయింగ్-XI: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టాయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎలిస్, మాథ్యూ క్యూనెమాన్, జోష్ హేజిల్‌వుడ్
భారత్, ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ ఎప్పుడు?
ఈ సిరీస్‌లో రెండో టీ20 అక్టోబర్ 31న మెల్‌బోర్న్‌లో జరగనుంది. భారత్ 2008లో మొదటి సారి ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ ఆడింది. అప్పటి నుంచి భారత్ రెండు సార్లు సిరీస్ గెలిచింది. ఇప్పుడు సూర్య సేన మరో సిరీస్ గెలుపుపై కన్నేసింది.