టెస్టులు అయిపాయే.! వన్డేలపై టీమిండియా ఫోకస్.. పగ తీర్చుకుంటుందా మరి.?
Team India: టెస్టుల్లో ఓటమి తర్వాత భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్నాయి. శుభ్‌మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్, కోహ్లీ కీలకంగా మారనున్నారు.

టెస్టుల్లో బోల్తా.. ఇప్పుడు వన్డేలు..
టెస్టుల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. చివరికి సౌతాఫ్రికా వ్యూహాల ముందు నిలవలేకపోయింది. టెస్టులను టెస్టుల్లా కాకుండా వైట్ బాల్ ఫార్మాట్‌లా ఆడటానికి ప్రయత్నించి చిత్తుగా ఓడిపోయింది. రెండు టెస్టుల సిరీస్‌లో కనీసం ఫైట్ కూడా ఇవ్వలేక పాతికేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
ఆ మాజీ కెప్టెన్లు కీలకం..
టెస్టులతో పోల్చితే వన్డేల్లో టీమిండియా బలంగా కనిపిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నారు. ఇద్దరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసి రానుంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కోల్‌కతా టెస్టులో గాయపడటంతో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో వన్డేల్లో టీమిండియాకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్నాడు.
రెగ్యులర్ వైస్ కెప్టెన్ కూడా దూరం..
రెగ్యులర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. సిడ్నీ వన్డేలో గాయపడిన తర్వాత అయ్యర్ ఆటకి దూరమయ్యాడు. అతను బరిలో దిగడానికి ఇంకా రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఓపెనర్‌గా గిల్ స్థానంలో ఎవరు దిగుతారు. శ్రేయస్ అయ్యర్ బదులుగా నాలుగో స్థానంలో ఎవరు ఆడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రో-కోపైనే భారం..
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఒక ఓపెనర్‌గా రోహిత్ శర్మ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఆడే అవకాశం ఉంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కూడా అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. అయితే ఓపెనర్ స్లాట్ కోసం రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీలో ఉన్నాడు. ఇటీవల ఇండియా ఏ జట్టు తరఫున మెరుగ్గా రాణించాడు. మూడో స్థానంలో కోహ్లీ మీద భారీ అంచనాలే ఉండబోతున్నాయి. నాలుగో స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. గ్యాప్ తర్వాత జట్టులోకి పంత్ వచ్చాడు. పైగా వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. దీంతో తుది జట్టులో పంత్ ఉండటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ధృవ్ జురేల్ బెంచ్‌కే పరిమితం కావచ్చంటున్నారు.
వన్డే సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి..
వన్డే టీమ్‌లో అక్షర్ పటేల్‌కు ఛాన్స్ దొరకలేదు. తుది జట్టులో స్పిన్ ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా బరిలో దిగడం ఖాయమనే అంచనాలున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ ఒక్కడే ఉన్నాడు. జట్టులో చోటు కోసం పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సైతం ఎదురు చూస్తున్నాడు. వన్డే సిరీస్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. దీంతో పేస్ విభాగాన్ని అర్షదీప్ సింగ్ లీడ్ చేసే అవకాశం ఉంది. మరో పేసర్‌గా హర్షిత్ రాణా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. రేస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు. అయితే, టెస్ట్ సిరీస్ ఓటమిని మరిచిపోయి భారత్ సమిష్టిగా రాణించాలని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ అడ్వాంటేజ్‌ను వినియోగించుకొని చెలరేగాలంటున్నారు. మొత్తంగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే వన్డే సిరీస్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

