PM Modi : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ పై భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. పాకిస్తాన్‌పై విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ "ఆపరేషన్ సింధూర్" ను గుర్తు చేస్తూ అభినందనలు తెలిపారు.

PM Modi congratulates India : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలిచింది.

Scroll to load tweet…

ప్రధాని మోదీ ట్వీట్.. ఆపరేషన్ సిందూర్ నుంచి ఆపరేషన్ తిలక్ వరకు

ఆసియా కప్ 2025 లో పాకిస్తాన్ పై భారత్ విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక X లో అభినందనలు తెలిపారు. ఆయన తన ట్వీట్ లో.. "క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్‌దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు" అనే పేర్కొన్నారు.

Scroll to load tweet…

ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా అభినందనలు తెలిపారు. పీయూష్ గోయల్, కిరెన్ రిజిజూ, బీజేపీ నాయకుడు అమిత్ మాల్వీయ వంటి పలువురు రాజకీయ నాయకులు టీమ్ ఇండియాను ప్రశంసించారు. కిరెన్ రిజిజూ తన సందేశంలో "పాకిస్తాన్ ఓడిపోవడం సహజమే, భారత్ ఎల్లప్పుడూ ఛాంపియన్‌గా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.

కూలిన పాకిస్తాన్ బ్యాటింగ్

ఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో పాకిస్తాన్ జట్టు ఆధిపత్యం చూపించింది. 84 పరుగుల వద్ద ఏ వికెట్ పడకపోవడంతో బలమైన స్థితిలో కనిపించింది. కానీ త్వరగానే ఆట మలుపు తిరిగింది. 146 పరుగులకే మొత్తం జట్టు ఆలౌటైంది. ఈ కొలాప్స్ తర్వాత భారత్ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో కాస్త తడబడింది. 19.4 ఓవర్లలో 150 పరుగులు చేసి భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తిలక్ వర్మ విజయ తిలకం

ఈ ఫైనల్‌లో మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్‌లో ప్రధానంగా నిలిచిన ఆటగాడు తిలక్ వర్మ. 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు పెద్దగా రాణించకపోయినా తిలక్ అద్భుత ప్రదర్శనతో జట్టు గెలుపును ఖాయం చేశాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టాడు.

పాకిస్తాన్ ఆటగాళ్ల వివాదాస్పద సంబరాలు

టోర్నమెంట్ మొత్తం పాకిస్తాన్ ఆటగాళ్లు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. బ్యాట్‌ను తుపాకీలా చూపించడం, ఫీల్డ్‌లో అతిగా సంబరాలు చేయడం వంటి చర్యలు విమర్శలకు గురయ్యాయి. ఫైనల్‌లో భారత్ ఘనవిజయం సాధించడం ద్వారా ఈ వివాదాలకు సమాధానం ఇచ్చినట్లైంది.

మొత్తంగా ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించింది. ప్రధానమంత్రి మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జట్టు విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు.