అప్పుడు 0-3, ఇప్పుడు 0-2.! టీమిండియాకు శనిలా దాపురించిన ఆ ఇద్దరు.. ఎందుకురా ఇలా..
Team India: సొంత గడ్డపై భారత టెస్ట్ క్రికెట్ జట్టు దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో పేలవంగా ఓడిపోవడంతో పాటు, గత న్యూజిలాండ్ వైట్ వాష్‌తో టీమిండియా పతనం ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది.

549 టార్గెట్.. కానీ.!
సొంతగడ్డపై ప్రస్తుతం టీం ఇండియా ప్రదర్శన దిగజారుతోంది. ఇదే క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు స్వదేశంలో బలమైన జట్టుగా పేరుగాంచిన భారత్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో పూర్తిగా పట్టు కోల్పోయింది. కోల్ కతా టెస్టులో కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన భారత జట్టు, గౌహతి టెస్టులో మరింత పేలవమైన ఆటను ప్రదర్శించింది. గౌహతిలో, తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాకు 489 పరుగుల భారీ స్కోరును భారత్ అందించింది. దీనికి బదులుగా, బ్యాటింగ్ లో 201 పరుగులకే ఆలౌట్ అయి, సౌత్ ఆఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అలా మొత్తం 549 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది.
140 పరుగులకే ఆలౌట్..
రెండవ ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ పూర్తిగా చతికిలబడింది. 140 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 408 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరపున కేవలం రవీంద్ర జడేజా మాత్రమే అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. జడేజా మినహా మిగిలిన ఏ బ్యాటర్ కొద్దిసేపు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. ఇక రెండో టెస్టులోనూ ఓడిపోయి 2-0తో సిరీస్ వైట్ వాష్ చేయించుకుంది.
అప్పుడు 0-3, ఇప్పుడు 0-2
ఈ టీమిండియా చెత్త ప్రదర్శనకు కారణాలు ఏంటి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో 0-3 తో ఘోరంగా ఓడిపోయి సొంత గడ్డపై వైట్ వాష్ కు గురైనప్పటి నుంచే ఈ సమస్యలు మొదలయ్యాయి.
ఆ దిగ్గజాలపై విమర్శలు..
ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు వచ్చాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఇంగ్లాండ్ పర్యటనలో ప్రదర్శన పరంగా కాస్త మెరుగుపడినా, సొంత గడ్డపై మాత్రం భారత జట్టు నిలకడలేమిని ప్రదర్శిస్తోంది. ఇక ఇప్పుడు సఫారీల చేతిలో కూడా ఘోరంగా ఓడిపోయింది టీమిండియా.
ఆ ఇద్దరినీ తీసేయండి..
ప్రస్తుత ఓటములతో అభిమానులు, మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శల జడివాన కురుస్తోంది. గంభీర్ తీసుకునే నిర్ణయాలే భారత జట్టు పతనానికి కారణమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. తనకు నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటూ, డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో రెడ్ బాల్ క్రికెట్‌లో బాగా ఆడుతున్న ప్లేయర్లను పక్కన పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై కూడా అభిమానులు మండిపడుతున్నారు.

