Ashada Masam: ఆషాడ మాసంలో గోరింటాకు పండగ.. ఎరుపు రంగుతో పండే దాని రహస్యం ఏంటంటే?
Ashada Masam: మగువల మనసు దోచే గోరింటాకు ఎంత పవిత్రమైనది. ఎరుపు రంగుతో పండే దాని వెనుక ఉన్న పురాణ గాధ ఏమిటో.. అసలు గోరింటాకు మనం ఆషాడంలోనే ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
సాధారణంగానే గోరింటాకు అంటే ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ. అలాంటిది ఆషాడం వచ్చిందంటే ఆ ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం కూడా. అయితే ఆషాడం లోనే ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆషాడ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. అంటే క్రిమి కీటకాదులు చేరటానికి ఇదే సరైన సమయం. ఆ చెమ్మకి, తేమకి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. గోరింటాకు పెట్టుకోవడం వలన అలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని ఆయుర్వేద నిపుణులు ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నారు.
గోరింటాకు వల్ల సంతాన ఉత్పత్తి పెరుగుతుందని అండా చేయాలా పనితీరు సక్రమంగా పనిచేస్తుందని మన ఆయుర్వేదం చెబుతుంది. పైగా గోరింటాకు మన శరీరంలో ఉన్న అధికమైన వేడిని తగ్గిస్తుంది. అందులో ఉండే సహజమైన రంగు మన తలకి కూడా మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.
గోరింటాకు లో ఉండే ఔషధ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా చేస్తుంది. అంతా బాగుంది కానీ దీనికి ఉన్న పవిత్రత ఏంటి అని అంటారా.. గోరింటాకు గౌరీదేవి రుధిరాంశతో జన్మించిన వృక్షం. అంటే గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో ఆడుకుంటున్నప్పుడు రజస్వల అవుతుంది ఆ సమయంలో రక్తపుచుక్క నేల మీద పడి ఒక మొక్క ఉద్భవిస్తుంది.
ఇది చూసిన చెలికత్తెలు పర్వత రాజు దంపతులకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. వారు వచ్చి చూసేసరికి మొక్క పెరిగి పెద్దదవుతుంది. గౌరీదేవి మృదురాంశతో జన్మించాను నావల్ల లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని ఆ చెట్టు అడుగుతుంది. అప్పటికే చిన్నపిల్ల అయినా గౌరీదేవి ఆ చెట్టు ఆకులని తెంపగానే చేయి ఎర్రగా అవుతుంది.
కూతురికి ఏమైనా అయిందా అని కంగారు పడతారు పర్వత రాజు దంపతులు. తనకేమీ కాలేదని ఈ రంగు చాలా బాగుందని సంతోషంగా తండ్రికి చెప్తుంది గౌరీదేవి. అప్పటినుంచి స్త్రీలకి సౌభాగ్యం చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరం ఇస్తాడు పర్వత రాజు. అప్పటినుంచి ఆడవారికి అందాన్ని ఆధ్యాత్మికతని ఇచ్చే గోరింటాకు అంటే మక్కువ మొదలైంది.