ఇవి మీ ఇంటి ముందు ఉంటే డేంజరే
మనం ఇల్లు కట్టుకొనేటప్పుడు చాలా విషయాలు పట్టించుకుంటాం. హౌస్ ఫేసింగ్, వాస్తు, స్థలంలో దోషాలు, వీధి శూల ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తాం. అయితే ఒకసారి ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటిని ఎలా చూసుకోవాలన్న విషయంపై చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఇంటి ముందు, లోపల ఎలాంటి వస్తువులు ఉంచితే మంచిది? ఎలాంటివి ఉంచకూడదు అన్న దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఇక్కడ మనం ఇంటి మెయిన్ డోర్ ముందు ఎలాంటి వస్తువులు ఉంచకూడదో తెలుసుకుందాం.
ఎండిపోయిన మొక్కలు
చాలా మంది ఇంటి మెయిన్ డోర్ వద్ద చిన్న కుండీల్లో మొక్కలు పెంచుతారు. అయితే వాటి సంరక్షణ సరిగ్గా చూడకపోతే అవి ఎండిపోయి చనిపోతాయి. అలా చనిపోయిన మొక్కలను వెంటనే తీసి పడేయాలి. ఎండిపోయిన మొక్కలు, ముళ్ల మొక్కలు ఇంటి ముందు ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. కష్టాలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయట.
పదునైన కత్తులు
ఇంటి మెయిన్ డోర్ సమీపంలో ఎక్కడా పదునైన కత్తులు, ఇనుప వస్తువులు ఉంచకూడదు. వీటి వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయట. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంటి ముందు ఉంటే స్నేహితులు, బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంటుందట.
ముదురు రంగు వస్తువులు
ప్రవేశ ద్వారం వద్ద నల్ల చాపలు, ఏవైనా విగ్రహాలు ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ బ్రేక్ అవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందువల్ల లేత రంగులతో ఇంటి గోడలు, డిజైన్లు వేయించుకోవడం మంచిది.
చెత్త డబ్బాలు
నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించే లక్షణాలున్న డస్ట్ బిన్లను ఇంటి ముందు ఉంచకూడదు. ఇలాంటి చెత్తను ఎవరికి కనిపించని ప్లేస్ లో పెట్టాలి. చెత్త చెడును సూచిస్తుంది. అందువల్ల ఇంటికి వచ్చే వారికి ముందుగా చెత్త డబ్బా కనిపిస్తే బ్యాడ్ గా ఫీలవుతారు.
సెప్టిక్ ట్యాంకులు
ఇల్లు కట్టే ముందే ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇంటి మెయిన్ డోర్, గేట్ వద్ద సెప్టిక్ ట్యాంకులు నిర్మించకూడదు. దీనికి రెండు కారణాలుంటాయి. దుర్వాసన, క్రిమి కీటకాలు మెయిన్ డోర్ నుంచే లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. తుఫానులు, వర్షాల సమయంలో ట్యాంకుకు ప్రమాదం జరిగితే ఇంటికే ముప్పు రావచ్చు. ట్యాంకులు నెగెటివ్ సెన్స్ ను కూడా సూచిస్తాయి. అందువల్ల ఇంటి ముందు సెప్టిక్ ట్యాంకులు నిర్మించకూడదు.
చెప్పులు
ఇంటి ముందు చెప్పులు ఉంచడాన్ని చాలా మంది తప్పుగా భావిస్తారు. ఎందుకంటే చెప్పులు శనికి ప్రతిరూపంగా నమ్ముతారు. అందువల్ల ఇంటి ముందు వాటిని వదిలితే నెగెటివ్ ఎనర్జీ వల్ల బ్యాడ్ జరుగుతుందని అనుకుంటారు. అంతేకాకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన చెప్పులు ఇంటి ముందు వదలడం వల్ల క్రిములు, వైరస్ లు ఇంటిలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇంటి ముందు, ముఖ్యంగా ప్రధాన ద్వారం ముందు చెప్పులు వదలకూడదు.
విరిగిన వస్తువులు
ఇంటి ముందు శుభ సూచకంగా ఉంటుందని చాలా మంది దేవుడి ఫొటోలు పెడతారు. అయితే ఎండ ధాటికి ఆ ఫొటోల అద్దాలు పగిలిపోతాయి. ఇల్లు శుభ్రం చేసే సమయంలోనూ స్టిక్స్ తగిలి ఫొటోలు దెబ్బతింటాయి. అలాంటి వాటిని ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఉంచకూడదు. అంతేకాకుండా పగిలిన పూల కుండీలు, అద్దాలు, విరిగిన కుర్చీలు లాంటివి కూడా ఉంచకూడదు.
పాడైన దిష్టి బొమ్మలు
ప్రతి ఒక్కరూ తమకు దిష్టి తగలకుండా బొట్టు, రకరకాల తాళ్లు కట్టుకుంటారు. అలాగే వారి ఇంటికి కూడా దిష్టి తగలకూడదని గుమ్మిడి కాయలు, పటిక, మిరపకాయలు, రాక్షస బొమ్మలు, రెడ్ క్లాత్ వంటివి ఇంటి మెయిన్ డోర్ ముందే కట్టుకుంటారు. అయితే ఆ వస్తువులు పాడైపోయినా పట్టించుకోరు. వాస్తు ప్రకారం ఇది చాలా డేంజర్ అని పండితులు చెబుతున్నారు. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దిష్టి గుమ్మిడి కాయలు, క్లాత్ వంటివి పాడైపోతే వెంటనే మార్చేయాలని సూచిస్తున్నారు.