Dhanteras: ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కాదు.. కొనాల్సినవి ఇవే..!
Dhanteras: ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనడానం మంచిది అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఈ రోజున నిజంగా బంగారం, వెండి కొనాలా? లేకపోతే.. ఏం కొంటే శుభం కలుగుతుంది?

Dhanteras
ధనత్రయోదశిని దీపావళి పండగకు ముందు జరుపుకుంటారు. ఈ ఏడాది ధనత్రయోదశిని అక్టోబర్ 18వ తేదీన జరుపుకోనున్నారు. ఇది కేవలం సంపద, శ్రేయస్సు కు సంబంధించిన పండగ మాత్రమే కాదు.. మతపరమైన, జోతిష్యశాస్త్ర దృక్కోణం నుంచి కూడా ఇది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ ధంతేరాస్ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. బ్రహ్మ యోగం మీ ఇంటికీ, వ్యాపారానికీ సానుకూల శక్తిని తెస్తుంది. ఇది శ్రేయస్సు, పురోగతిని తీసుకురావడానికి సహాయపడుతుంది. దీనితో పాటు, ధనత్రయోదశి రోజున శుభ శివవాస యోగం ఏర్పడుతోంది. ఇది కుటుంబంలో శాంతి, అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది.
ధనత్రయోదశి రోజున ఏం కొనాలి..?
హిందూ మతంలో ధన త్రయోదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనడం వల్ల కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు , సంపద లభిస్తుంది నమ్ముతారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో బంగారం, వెండి కొనడం అంత సులభం కాదు. చిన్న ఉంగరం కొనాలన్నా వేలల్లో ఖర్చు అవుతోంది. కానీ, ఈ రెండూ కొనకపోయినా... లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొనాల్సినవి ఇవే...
ఇత్తడి పాత్ర: ఇత్తడి పాత్రలను కొనడం పురాతన కాలం నుండి ఉంది. మత విశ్వాసాల ప్రకారం, ఇత్తడిని ధన్వంతరి లోహంగా భావిస్తారు. మీరు బంగారానికి బదులుగా ఇత్తడి పాత్రలను కొనడం శుభప్రదం.
• చీపురు: చీపురును లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున మీరు చీపురు కొంటే, ప్రతికూలత తొలగిపోతుంది. చీపురును ఇంటికి తీసుకువచ్చి పూజించండి.
• కొత్తిమీర: ధన్ తేరాస్ రోజున, కొత్తిమీర, లేదా దనియాలు కొనండి. వాటిని దేవత ముందు అర్పించి, పూజించి, ఆపై వాటిని అల్మారాలో ఉంచండి.
గోమతి చక్రం: ధన్ తేరాస్ నాడు మీరు గోమతి చక్రాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
ధనత్రయోదశి రోజున ఏం చేయాలి?
ధనత్రయోదశి రోజున మీరు ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద, పూజా మందిరం ముందు రంగోలి వేయండి. కలశం ఏర్పాటు చేసే ముందు ఆ స్థలాన్ని శుభ్రం చేయండి. కలశాన్ని ప్రతిష్టించిన తర్వాత, లక్ష్మీ , కుబేరుల విగ్రహం లేదా ఫోటోను ఉంచండి. షోడ షోపాచారాలతో దేవతలను పూజించండి. దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించండి. పేదలకు దానం చేయండి. మీరు భక్తితో దేవిని పూజిస్తే, మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.